టోక్యో, సెప్టెంబర్ 18 : జపాన్లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న TAJ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో వినాయక చవితి (Vinayaka Chavithi) వేడుకలను ఘనంగా నిర్వహించారు. టోక్యోలోని ఓజిమా ప్రాంతంలో భక్తిశ్రద్ధలతో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా వైభవంగా జరిపిన ఈ వేడుకల్లో తెలుగు కుటుంబాలతో పాటు స్థానిక జపాన్ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 18, గురువారం ఈ సంబురాల్లో పాల్గొన్న జపనీయులు భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలను ఆసక్తిగా వీక్షించారు.
వినాయక చవితి వేడుకలో భారతీయులు, జపాన్ స్థానికులు పాల్గొనడం.. రెండు దేశాల సంస్కృతుల మధ్య స్నేహం, సాంస్కృతిక పరస్పర అవగాహనకు ప్రతీకగా నిలిచింది. వినాయక చవితిని పురస్కరించుకుని వినాయకుడికి ప్రత్యేక పూజలు, భక్తి , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు.

“ఎక్కడ ఉన్నా మన సంస్కృతి మనతోనే” అనే భావనతో.. జపాన్లోని తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను పరిచయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్థానిక జపాన్ సమాజంతో సాంస్కృతిక అనుబంధాలను పెంపొందించేలా తాజ్ నేతృత్వంలో వినాయక చవితి వేడుక కన్నులపండువగా జరిగింది. టోక్యోలో తెలుగు సంస్కృతి, భారతీయ సంప్రదాయాలు.. స్థానికుల భాగస్వామ్యం, భక్తి, సమాజ ఐక్యత కలగలిసి వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలు, చిన్నారులు, తాజ్ సభ్యులు, జపాన్ స్థానికులు పరస్పరం వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. జపాన్లో భారతీయ, తెలుగు సంస్కృతిని కొనసాగిస్తూ, జపాన్ సమాజంతో స్నేహపూర్వక సాంస్కృతిక వారథిని నిర్మించడంలో తాజ్ కీలక పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు తెలిపారు.