కూసుమంచి, ఆగస్టు 8 : ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు రైతులు ఈ వానకాలం వరి పంట వేద్దామా..? వద్దా? అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం సాగర్ ఆయకట్టు సుమారు 2లక్షల ఎకరాల్లో లక్ష ఎకరాలకు వైరా రిజర్వాయర్ ద్వారా, మరో లక్ష ఎకరాలకు పాలేరు రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందుతోంది. అయితే వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు రావడంతో అక్కడి రైతులు వరినాట్లు ముమ్మరంగా వేస్తున్నారు. పాలేరు కింద మాత్రం బోరు, బావులు ఉన్న రైతులు మాత్రమే వరినాట్లు వేస్తుండగా.. మిగిలిన రైతులు సాగునీటి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. గత వారంరోజులుగా ఎగువన పడుతున్న వర్షాలతో కృష్ణా నది ప్రాజెక్టుల్లోకి వరద భారీగా వస్తుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇదిలాఉంటే, ఎల్‌నినో ప్రభావం తప్పదని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయకట్టు కింద వరినాట్లు వేయవద్దని అధికారులు పదేపదే చెబుతుండడంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు.
ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఏడాది వర్షాకాలం మొదలైనప్పటి నుంచీ సరైన వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలు తగ్గాయి. అయితే గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వరినాట్లు వేయవద్దని అధికారులు చెబుతున్నప్పటికీ గ్రామాల్లో బోరు, బావుల కింద ముమ్మరంగా వరినాట్లు వేస్తున్నారు. సాగర్ ఆయకట్టు రైతులు మాత్రం ఆగమాగమవుతున్నారు. పాలేరు రిజర్వాయర్ కింద సాగులో ఉన్న భూముల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టు పరిధిలో బోరు, బావులు ఉన్న రైతులు వరినాట్లు వేస్తుండగా.. మిగిలిన రైతులు కాలువల ద్వారా వచ్చే సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పటివరకు పాలేరు రిజర్వాయర్, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరు లేకున్నప్పటికీ కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రైతన్నల్లో ఆశలు కలుగుతున్నాయి. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుల నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. జిల్లావ్యాప్తంగా సాగర్ ఆయకట్టులో సగభాగం గోదావరి నీటితో వైరా ప్రాజెక్టు నుంచి సాగునీరు అందుతుండగా.. మిగిలిన సాగర్ ఆయకట్టుకు పాలేరు నుంచి సాగునీరు వస్తుందా? రాదా? అని రైతులు సందిగ్ధంలో పడ్డారు. మొత్తానికి వర్షాకాలం సాగు ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు గందరగోళం చెందుతున్నారు.
కూసుమంచి 15,300, నేలకొండపల్లి 15,231, సత్తుపల్లి 14,229, పెనుబల్లి 13,590, వేంసూరు 14,164, తల్లాడ 11,927, కల్లూరు 11,419, కామేపల్లి 462, ఖమ్మం అర్బన్ 439, రఘునాథపాలెం 1001, తిరుమలాయపాలెం 4,881, బోనకల్ 1,279, చింతకాని 302, మధిర 650, ముదిగొండ 1,729, ఎర్రుపాలెం 774, ఏన్కూరు 1,709, కొణిజర్ల 103, సింగరేణి, 151, వైరా 1,150 ఎకరాల్లో రైతులు ఇప్పటివరకు వరినాట్లు వేశారు. అయితే ఇవి వారంరోజుల కింద వివరాలు. ప్రస్తుతం వైరా ఆయకట్టు కింద ముమ్మరంగా వరినాట్లు జరుగుతున్నాయి.