మోర్తాడ్/నిజాంసాగర్/నాగిరెడ్డిపేట, ఆగస్టు 8: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎట్టకేలకు సగం నిండింది. వర్షాకాలం ఆరంభమైన రెండు నెలలకు ఎస్సారెస్పీలో నీటిమట్టం 40 టీఎంసీలకు చేరుకున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా, శనివారం సాయంత్రానికి 40. 861 టీఎంసీలకు చేరింది. 19,305 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 993 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది.
శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో ఒక్కసారిగా పెరిగింది. శనివారం ఉద యం 9283 క్యుసెక్కుల వరద వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీల)కు గాను ప్రస్తుతం 1399.83 అడుగులు (11.18 టీఎంసీ) నీరు నిల్వ ఉం ది. సంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షానికి నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా వద్ద గల నల్లవాగు మత్తడి పొంగిపొర్లింది. నాగమడుగు లోలెవల్ వంతన పైనుంచి వరద ప్రవహించడంతో అచ్చంపేట వైపు రాకపోకలు నిలిచిపోయా యి. నాగిరెడ్డిపేట మండలంలోని పోచా రం ప్రాజెక్టులోకి 5,983 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు వెళ్లిపోతున్నది.