ఎన్నికల సంఘం గురువారం జిల్లా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో 13,55,482 ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. అందులో పురుషులు 6,75,489 మంది. మహిళలు 6,79,945 మంది, ఇతరులు 48 మంది. అత్యధికంగా మునుగోడు నియోజక వర్గంలో 1,20,817 మంది, అత్యల్పంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 1,07,659 మంది ఓటర్లు ఉన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా కొత్తగా 17,562 మంది ఒటు హక్కును పొందగా, వివిధ కారణాలతో 2703 ఓట్లను తొలగించడం జరిగింది.
– నీలగిరి, జనవరి 5
నీలగిరి, జనవరి 5: నల్లగొండ జిల్లా ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దాని ప్రకారం జిల్లాలో 13,55,482 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 13,58,185 మంది ఓటర్లు ఉండగా నూతన జాబితాలో 2703 మంది తగ్గినట్లు తేలింది. పోలింగ్ కేంద్రాలు 1747గా నిర్ధారించారు.
17562 మంది కొత్త ఓటర్లు…
జిల్లాలో 17,562 మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు. కొత్త ఓటర్ల నమోదులో అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో 5,485 మంది, అత్యల్పంగా దేవరకొండ నియోజకవర్గంలో 1,756 మంది ఓటర్లుగా నమోదయ్యారు. నాగార్జునసాగర్‌లో 2,198, మిర్యాలగూడలో 2,489, నల్లగొండలో 2,981, నకిరేకల్‌లో 2,653 మంది కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్నారు.
దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ
నవంబర్ ఒకటిన ముసాయిదా జాబితా ప్రచురించిన ఎన్నికల సంఘం 18 ఏండ్లు నిండిన యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దాంతో పాటు జాబితాపై అభ్యంతరాలను, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. పోలింగ్ స్టేషన్ల మార్పులు చేర్పుల అనంతంరం జిల్లాలో 1747 పోలింగ్ కేంద్రాలను నిర్ధారించారు. తుది ఓటరు జాబితాను ఆయా పోలింగ్ కేంద్రాలతో పాటు తాసీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్లో అందుబాటులో ఉంచారు.
మునుగోడులో అత్యధిక ఓటర్లు
జిల్లాలో ఆరు నియోజక వర్గాలు ఉండగా మునుగోడు నియోజకవర్గంలో అధికంగా 2,40,093 మంది ఓటర్లు ఉండగా మిర్యాలగూడలో అత్యల్పంగా 2,11,898 మంది ఉన్నారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండగా.. దేవరకొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.