నేరేడుచర్ల, డిసెంబర్ 2: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలు చేయకుం డా మాయమాటలతో కాంగ్రెస్ పార్టీ కాలక్షేపం చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం నేరేడుచర్ల బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ వాహనాల్లో, హెలిక్యాప్టర్లలో తిరుగు తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారని పత్రికల్లో, టీవీల్లో పెద్దపెద్ద అక్షరాలతో వస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కేంద్ర మం త్రి బండి సంజయ్ వ్యవహారం చూస్తూంటే రాష్ట్రం లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైనట్లు ఉందన్నారు. అందుకోసమే సీఎం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తుంటే కనీసం ప్రశ్నించడం లేదన్నారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటీవల ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్‌లో కూడా దొంగ ఓట్లు చాలా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరూపించినప్పటికీ ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగులుతుందనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా ప్రచారం చేస్తున్నారని, గతంలో ఎన్నడూ కూడా స్థానిక ఎన్నికల్లో సీఎం ప్రచారం చేయ్యలేదన్నారు.
బీసీల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ చివరికి బీసీలనే మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో 12,753 గ్రామ పంచాయతీలు ఉండగా ఎస్సీలకు 17శాతం, ఎస్టీలకు 10శాతం, బీసీలకు 23శాతం మాత్రమే కేటాయించారన్నారు. బీసీలకు సుమారు 3వేల గ్రామ పంచాయతీలు కేటాయించాల్సి ఉండగా, కేవలం 2,146 పంచాయతీలను మాత్రమే కేటాయించారని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సక్రమంగా ఎక్కడ అమలవుతున్నాయే చెప్పాలన్నారు. అవినీతిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పోటీలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను ఇచ్చిన హామీలపైన ప్రజలు నిలదీయాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే నైతిక హక్కు వారికి లేదన్నారు. రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయ్యాలని, బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురుశ్బాబు, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు చిత్తలూరి సైదులు, యల్లబోయిన లింగయ్య, నాయకులు కేఎల్ఎన్ రెడ్డి, రాములు, పిచ్చిరెడ్డి, సుదర్శన్, శ్రీరామ్మూర్తి, సైదిరెడ్డి, శ్రీను, వెంకన్న, లచ్చిరెడ్డి, రాజేశ్ తదితరుల ఉన్నారు.