నల్లగొండ సిటీ, ఏప్రిల్ 5 : కాంగ్రెస్ ఉచిత విద్యుత్ హామీ మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. తాము అధికారంలోకి వస్తే గృహ వినియోగ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వినియోగదారులు మొండిచెయ్యి చూపుతున్నది. ఉచిత విద్యుత్ అమలు కోసం ప్రారంభంలో మార్గదర్శకాలను విడుదల చేసి తెల్ల రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఫ్రీ కరెంట్ ఇస్తామని ప్రకటించింది. అద్దె ఇండ్లల్లో ఉండేవారికి వర్తిస్తుందని తెలిపింది. మొదట్లో సమస్యలు ఉన్నా కొద్ది నెలలపాటు అమలు చేసింది. కానీ, తీరా ఎండకాలం వచ్చేసరికి 200 యూనిట్లలోపు రీడింగ్ వచ్చిన వినియోగదారులకు కూడా బిల్లు వేస్తున్నది.
నల్లగొండ జిల్లాకేంద్రంలోని రాక్ హిల్స్ కాలనీలో అద్దెకు ఉంటున్న మహ్మద్ రఫీకి కొన్ని నెలలుగా ఉచిత విద్యుత్ అందుతున్నది. ఇంతవరకు బాగానే ఉన్నా, మార్చి నెలకు సంబంధించి 30 రోజులకు గానూ 199 యూనిట్ల రీడింగ్ రాగా, విద్యుత్ సిబ్బంది రూ. 1,163 బిల్లు వేసి ఇచ్చారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పింది కదా విద్యుత్ సిబ్బందిని ప్రశ్నిస్తే సరైన సమాధానమే లేదని రఫీ వాపోతున్నాడు.