సూర్యాపేట, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : సన్న వడ్లకు క్వింటాక్ రూ.500ల బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీకి సున్నం పెడుతున్నది. గత యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన వడ్ల బోనస్ నేటికీ రైతుల ఖాతా లో పడకపోగా ప్రస్తుత సీజన్లో అసలు కొనుగోళ్లనే బంద్ చేసింది. ఈ సీజన్‌కు సంబంధించి సుమారు రెండు నెలల క్రితం కొనుగోలు సెంటర్లు ప్రారంభిస్తే జిల్లాలో పండించిన పంటలో ఒక్క శాతం కూడా సన్నాలను కొనుగోలు చేయలేదు. జిల్లా వ్యాప్తంగా 6.70 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనాగా ఉంటే ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 6,036 మెట్రిక్ టన్నులు మాత్ర మే కావడం గమనార్హం.
కేవలం బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే సన్నాలను కొనుగోలు చేయడంలేదని తెలుస్తుండగా వాటికైనా బోనస్ ఇస్తరా.. ఇయ్యరా.. అనేది అనుమానమే. గత ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేందుకు ప్రజలను ఎన్ని రకాల మోసం చేయవచ్చో అన్ని రకాల మోసాలను కాంగ్రెస్ చేసింది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై ఢిల్లీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ జనాలకు వివరిస్తూ బాండ్ పేపర్లపై సంతకాలు చేసి ఇచ్చిన విషయం విదితమే. అందులో భాగంగా రైతు లు పండించే ప్రతి పంటకు బోనస్ ఇస్తామని చెప్పి మాట మార్చి, వడ్లకు మాత్రమే ఇస్తామని, అది కూడా సన్నాలు పండించిన వారికే ఇస్తామని చెప్పారు. సరే అదైనా ఇస్తారా అంటే వాటికి కూడా మంగళం పాడుతున్నారు.
దీంతో తమకు అన్నీ ఇచ్చిన కేసీఆర్‌ను కాదని కాంగ్రెస్‌కు ఓటేసి తమ కంట్లో తామే వేలు పెట్టుకున్నామని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నది. కేసీఆర్ నీళ్లిచ్చి… ప్రతి పంటకు రైతుబంధు రూపంలో పెట్టుబడి సాయం అందించి… సకాలంలో విత్తనాలు, ఎరువులు ఇచ్చి సరిపడా కరెంటుతో పాటు ఊరూరా కొనుగోలు సెంటర్లు తెరిచి,చివరి గింజవరకు కొనుగోలు చేస్తే రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో కొత్తవి ఒక్కటి కూడా ఇవ్వకపోగా కేసీఆర్ ఇచ్చినవి ఒక్కొక్కటిగా ఎగ్గొడుతున్నారని దుయ్యబడుతున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో బోనస్ ఎగ్గొట్టేందుకు సెంటర్లు ఏర్పాటు చేయలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
బోనస్ ఎగ్గొటేందుకే..
సన్నాలకు రూ.500ల బోనస్ ఎగ్గొట్టేందుకే కొనుగోలు చేయడం లేదని తెలుస్తున్నది. వాస్తవానికి యాసంగికి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్చి రెండో వారంలోనే ప్రారంభించాల్సి ఉండగా నెల రోజుల ఆలస్యంగా ప్రారంభించారు. దీనిలో కుట్ర కోణం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైతులు సన్న ధాన్యాన్ని దొడ్డు రకం కంటే 20 రోజుల ముందు నాట్లు వేస్తారు. అలాగే సన్నాల కంటే దొడ్డు రకం పంట పదిహేను రోజుల ఆలస్యంగా చేతికి వస్తుంది. ఈ లెక్కన సన్నాలు, దొడ్డు రకానికి 35 రోజుల వ్యవధి ఉంటుండగా సన్నాలు దాదాపు నెల ముందు చేతికి వస్తాయి.
బోనస్ ఇవ్వాల్సిన సన్న వడ్లను రైతులు అమ్ముకునేంత వరకు వేచి ఉండి నెల రోజుల ఆసల్యంగా అంటే ఏప్రిల్ రెండో వారంలో జిల్లాలో సన్న వడ్లు కొనుగోళ్ల కోసం అంటూ 60 కేంద్రాలను ప్రారంభించారు. అప్పటికే రైతులు తమ ధాన్యాన్ని రైతులు మిల్లులు, దళారులకు తక్కువ ధరకు, క్వింటా ఒక్కంటికి పది కిలోల తరుగుతో తెగనమ్ముకున్నారు. విచిత్రమేమిటంటే 60 కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 40 కేంద్రాల్లో జీరో కొనుగోళ్లు ఉన్నట్లు అధికారుల ద్వారా తెలిసింది.
ప్రస్తుత యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 12.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా వాటిలో 5.60 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం, 6.70 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం అని అంచనా వేసింది. కానీ జిల్లాలో ఇప్పటి వరకు అంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన రెండు నెలల్లో 6,036 మెట్రిక్ టన్నులు అంటే దిగుబడిలో ఒక్క శాతం మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. నిజంగా రైతులపై రేవంత్ సర్కార్‌కు ప్రేమ ఉంటే… ఎలాంటి మోసం చేయకుండా వారికి బోనస్ ఇవ్వాలని అనుకుంటే వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం సన్న వడ్లు సాగు చేసిన రైతాంగానికి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బోనస్ ఇవ్వకుంటే బుద్ధిచెబుతాం..
సన్న వడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని నమ్మబలికిన ప్ర భుత్వం సన్నాలు పండించిన ప్రతి రైతుకు క్వింటా ఒక్కంటికి రూ.500 బోన స్ ఇవ్వాలని లేని పక్షం లో ప్రభుత్వానికి తగిన బు ద్ధిచెబుతాం. వ్యవసాయశా ఖ ఆధ్వర్యంలో పల్లెపల్లెనా సర్వే చేసి ఏ రైతు ఏం పంట వేశారు అనే లెక్కలు ఉన్నాయని ఆ లెక్కన జిల్లాలో ఎన్ని ఎకరాల్లో సన్న వడ్లు పండించారో లెక్క లు చూసి బోనస్ ఇవ్వాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండగా వ్యవసాయానికి అన్నీ ఇస్తే నేడు ఒక్కొక్కటిగా మాయమతున్నాయి. కనీసం ఇచ్చిన హామీ మేరకు బోనస్ అయినా ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి.
-గుద్దేటి జాన్‌రెడ్డి, రైతు