హాలియా, ఆగస్టు 9 : నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కృష్ణానది పరీవాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలు విస్తారంగా కురిశాయన్నారు. సాగర్ ఎగువన ఉన్న జలాశయాలన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయని, ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు వచ్చి చేరుతున్నందున త్వరలో శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్రీశైలంలో జల విద్యుత్తు ఉత్పత్తిని చేపడితే అక్కడి నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి రోజుకు 50 నుంచి 60 వేల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. దీంతో సాగర్ జలాశయంలోకి రోజుకు ఒకటి నుంచి రెండు అడుగుల మేర నీరు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. గత రెండు రోజులుగా శ్రీశైలంలో జల విద్యుత్తు ఉత్పత్తి చేపట్టినందున నాగార్జున సాగర్ జలాశయంలోకి ఐదడుగుల మేర నీరు వచ్చి చేరిందన్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 517 అడుగుల మేర నీరు ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాగర్ జలాశయంలో డెడ్ స్టోరేజీలో ఉన్నప్పటికీ సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. గత తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం 18 సార్లు సాగర్ ఎడమ కాల్వకు రెండు పంటలకు సాగు నీటిని విడుదల చేసి, రైతులను ఆదుకున్నదన్నారు.
నీరివ్వలేనప్పుడు వరుణ యాగం ఎందుకు?
ఈ నెల 10న నాగార్జున సాగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం వరుణ యాగం చేపట్టం మంచిదేనన్నారు. అయితే సాగర్ ఎడమ కాల్వకు సాగునీరు ఇవ్వలేనప్పుడు వరుణయాగం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 8న నల్లగొండలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కోమటిరెట్టి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సాగర్ జలశయానికి వరదనీరు వచ్చి చేరినా ఎడమ కాల్వ రైతులకు సాగు నీరు ఇవ్వమని, సాగర్ జలాశయంలో ఉన్న నీటిని రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాల కోసమే వాడతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి ఓట్ల కోసం దేవుళ్ల మీద ఓట్టుపెట్టి రాష్ర్టానికి అరిష్టం తెస్తాడు.. నీటి పారుదల శాఖ మంత్రి వచ్చి నాగార్జునసాగర్ జలాశయం పక్కనే వరుణ యాగం చేపడతాడు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం సాగర్ జలాశయం వరదనీటితో నిండినా ఎడమ కాల్వ కింద ఉన్న రైతులకు సాగునీరు ఇవ్వబోమని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు చెన్ను సుందర్‌రెడ్డి, రమేశ్‌జీ, వడ్డే సతీష్‌రెడ్డి, నడ్డి బాలరాజు , లక్కమల మధు, లక్కుమల లింగయ్య, కారంపొడి రాజు, మహ్మద్ ఘనీ, విజయ్, బత్తుల శేఖర్, విజయ్, మంద శాంతకుమారి, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.