యాదగిరిగుట్ట, అక్టోబర్ 11: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి దినదిన గండం..నూరేళ్ల ఆయుష్షులా ఉంది. తమకు వేతనం ఎప్పుడిస్తారో.. విధుల నుంచి ఎప్పుడు తొలగిస్తారోననే భయంతో వారు పనిచేస్తున్నారు. సెలవులు ఉండవు.. సమయానికి రాకుంటే ఎటు మారుస్తారో చెప్ప లేం. వారికి నచ్చితే ఒకలా.. నచ్చకుంటే మరోలా వ్యవహరిస్తూ విధుల నుంచి తొలగిస్తున్నారని కాంట్రాక్టు కింద పనిచేసే చిరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ము ఖ్యంగా ఆలయంలో పనిచేసే ఓ ముఖ్య అధికారితోపాటు, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా పేరున్న మరో కాంగ్రెస్ పార్టీ నేత ఏం చెబితే అదే జరుగుతుందని ఔట్ సోర్సింగ్‌లో పనిచేసే ఓ ఉద్యోగి తమ గోడు వెళ్లబోసుకున్నాడు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దడంతో పాటు ఆలయాన్ని విస్తరించారు.
ఈ క్రమంలో దేవస్థాన సిబ్బందితో పాటు మరికొంత మంది ఔట్ సోర్సింగ్ (తాత్కాలిక) ఉద్యోగులను తీసుకుని భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగులను నియమించాలని 2022 అక్టోబర్ మాసంలో సురక్షా ఏజెన్సీకి అప్పగించడంతోపాటు ఉద్యోగులకు వేతనాలు సకాలంలో ఇచ్చేవారు.
వీరి కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది జూన్ మాసంలో గ్లోబల్ ఏజెన్సీ టెండర్ దక్కించుకుంది. దీంతోపాటు కొండకింద నియమించేందుకు వరంగల్‌కు చెందిన కృష్ణ కన్స్ట్రక్షన్స్కు క్రాంటాక్టును అప్పగించారు. ప్రస్తుతం గ్లోబల్ ఏజెన్సీ కింద కొండపైన ఆయా శాఖల్లో సుమారుగా 314 మంది, కృష్ణ కన్స్ట్రక్షన్స్ కింద సుమారుగా 150 మంది కంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
సెలవు తీసుకుంటే వేతనం కట్..
కార్మిక వేతన చట్టం ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ కలిపి నైపుణ్యంలేని వారికి (అన్‌స్కిల్) రూ. 15,600, తక్కువ నైపుణ్యం గల వారికి (సెమీస్కిల్) రూ. 19,500, నైపుణ్య కలిగినవారికి (స్కిల్) రూ. 22,750 వేతనం ఇవ్వాలి. ఉద్యోగులకు నెలకు మూడు రోజులతోపాటు ఏడాదిలో 15 క్యాజువల్ లీవ్‌లు ఉంటా యి. అదనం గా పండుగ , ఇతర అవసరాలకు సైతం వేతనంతో కూడిన సెలవు లు ఉంటాయి. ఒకవేళ ఏడాదికి 35 క్యాజువల్ లీవ్స్ తీసుకుని ఉంటే మిగతా సెలవులు వర్తించవు. మహిళలు ప్రసవిస్తే 180 రోజులు వేతనం కూడిన సెలవులు ఇవ్వాలి.
మహిళా ఉద్యోగికి నెల సమయంలో కొండపై ఉద్యోగం చేసే వీలు కల్పించాలి. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగి మరణిస్తే తక్షణ ఆర్థిక సాయంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఈపీఎఫ్ కింద రూ. 15 లక్షల ఆర్థిక సాయం అందించాలి. కానీ, యాదగిరిగుట్ట దేవస్థానంలో ఇవేమీ అమలు కావడం లేదని ఔట్ సోర్సింగ్ కార్మికులు లబోదిబో మంటున్నారు. పండుగ రోజు కూడా సెలవుల్లేకుండా డ్యూటీ చేస్తున్నామని వారు చెబుతున్నారు. సెలవు పెట్టిన రోజును గైర్హాజర్ కింద పరిగణించి వేతనంలో కోత విధిస్తున్నారని వాపోతున్నా రు. నెల సమయంలో సైతం ఉద్యోగానికి రాకపోతే వేతనం కట్ చేసి ఇస్తున్నారు. 8 గంటల చేయాల్సిన పనిని 9 నుంచి 10 గంటలు చేయాల్సి వస్తోందని, కనీసం వేతనాలు కూడా పెంచడం కూడా లేదంటున్నారు. నెలకు రావాల్సిన వేతనం మూడు నెలలు, నాలుగు నెలలకోసారి ఇస్తున్నారని వారు చెబుతున్నారు.
వారిదే ఇష్టారాజ్యం..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంతో యాదగిరిగుట్ట దేవస్థానంలో పనిచేసే ఓ ముఖ్య ఉద్యోగితో పాటు స్థానిక ఎమ్మెల్యేకు బినామీ, ముఖ్య అనుచరుడుగా కొండపైన చలామణి అవుతున్న కాంగ్రెస్ నాయకుడు కలిసి ఏజెన్సీలతో కుమ్మకై కోత విధించిన వేతనాలు స్వాహా చేస్తున్నట్లు అత్యంత విశ్వనీయవర్గాల సమాచారం. కొండపై ఉద్యోగి ఏది రాస్తే అదే అన్నట్టు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు వ్యవహరిస్తున్నాయి. వేతన సంబంధిత వ్యవహారాన్ని ఏజెన్సీలు ఆన్లైన్ వ్యవస్థ, బయో మెట్రి క్ హాజరు, పే స్లిప్పులు ఇచ్చినప్పటికీ వీరి అగడాలు మాత్రం ఆగడం లేదని తెలిసింది.
దేవస్థానం రూల్స్ ప్రకారం ఎంతమంది కాంట్రాక్టు సిబ్బంది కావాలో చెప్పాలే కానీ, ఫలానా వ్యక్తిని మాత్రమే నియమించాలన్న నిబంధన లేదు. అనుభవంతో పాటు విద్యార్హత కలిగిన వ్యక్తులు కావాలని పత్రికా ప్రకటనలు ఇచ్చి ఇంటర్వ్యూల ద్వారా సెక్యూరిటీ ఏజెన్సీలు నియమిస్తారు. కానీ దేవస్థానంలో కాం ట్రాక్టు ఉద్యోగం కావాలన్న ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉండాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ఒకవేళ వీరికి నచ్చని ఉద్యోగి ఉంటే ఆ ఉద్యోగిని అకారణంగా తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. దేవస్థాన అధికారులకు నచ్చినా నచ్చకపోయినా, దేవస్థాన ముఖ్య ఉద్యోగి, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడికి నచ్చకపోతే ఉద్యోగం ఔట్ అని కొండపై ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు పేర్కొంటున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా తమకు అనుకూలమైన వ్యక్తులు, బంధువులు, ఎన్నికల సమయంలో తన గెలుపునకు కృషి చేసినవారు, ఇతర ప్రాంతాల వ్యక్తులను మాత్రమే కొండపైన కాం ట్రాక్టు పద్ధతిన అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. దేవస్థానంలో ఉద్యోగం సంపాదించాలంటే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోవాల్సిందేనని స్థానికులు గుసగుసలాడుతున్నారు. ఎమ్మెల్యే అండదండలతో కొండపై అధికారి, ముఖ్య కాంగ్రెస్ నాయకుడు ఆగడాలు మితిమీరిపోయాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీరి ఒత్తిడి భరించలేక కొంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులకు రావడం లేద ట. ఈ విషయంలో పై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటేనే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది.