నల్లగొండ ప్రతినిధి, జనవరి 5(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ వచ్చాక వ్యవసాయానికి విద్యుత్తు సరఫరాలో జరుగుతున్న దారుణాలు, రైతుల ఇబ్బందులు, ఆ శాఖలోని డొల్లతనం, ఉదాసీనత, తదితర అంశాలన్నీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు దిమ్మతిరిగేలా చేశాయి. స్వయంగా ఆయన సమక్షంలోనే శాసనమండలిలో కరెంటు సమస్యపై సభ్యులు లేవనెత్తిన అంశాలు ఇబ్బంది పెట్టాయి. మంత్రి ఇక్కడ చెప్తున్న దానికి… క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అసలు పొంతనే లేదని కుండబద్దలు కొట్టేలా జరిగిన చర్చతో భట్టిని నిశ్చేష్టులయ్యేలా చేసింది. చర్చలో మండలి చైర్మన్ గుత్తా సైతం కలుగజేసుకుంటూ ఇవన్నీ వాస్తవాలేనని స్వరం కలపడంతో ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టినట్లయిందనే చర్చ మొదలైంది.
కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్తును కొనసాగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు ఆది నుంచి ఉన్నాయి. 24 గంటల పాటు ఇవ్వకుండా కోతల మీద కోతలు విధిస్తూ 14 నుంచి 15 గంటలకే సరఫరాను కుదించింది. ప్రస్తుతం సాయంత్రం 5 గంటలకు వ్యవసాయ మోటార్లకు త్రీఫేజ్ కరెంటును నిలిపివేసి అర్ధరాత్రి దాటక తిరిగి 2 గంటల సమయంలో పునరుద్ధరిస్తున్నారు. దాదాపు 9 నుంచి 10 గంటల పాటు సరఫరా పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఇక పొద్దంతా మధ్య మధ్యలో వివిధ రకాల పేర్లతో కోతలు విధించడం సర్వసాధారణం. దీంతో అటుఇటుగా 12 గంటల కరెంటు సరఫరానే అవుతుందనేది రైతులే చెప్తున్నారు. కానీ మంత్రి భట్టి విక్రమార్క నాణ్యమైన సేవలు అందిస్తున్నామని ఇప్పటివరకు చేస్తూ వస్తున్న ప్రకటనలన్నీ ఉత్తవేనని సోమవారం శాసనమండలిలో జరిగిన చర్చతో తేటతెల్లమైంది.
క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనేదీ..
కొత్త కనెక్షన్ కావాలన్నా…అదనపు ట్రాన్స్ఫార్మర్ లేదా కొత్తది కావాలన్నా… ట్రాన్స్ఫార్మర్ రిపేర్‌కు వచ్చినా…రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వమే స్వయంగా రైతులపై రూపాయి భారం లేకుండా చేయాల్సిన సేవలు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవు. ఏ చిన్న సమస్య వచ్చినా…రైతులే స్వయంగా చందాలు వేసుకొని ఖర్చు పెట్టుకొని, అవసరమైతే అధికారులకు లంచాలు ఇచ్చుకుంటే తప్ప పనులు జరగడం లేదన్నది వాస్తవం. ట్రాన్స్ఫార్మర్ రిపేర్లకు వస్తే అధికారులు స్పందించే సరికి పొలాలు ఎండిపోతున్నాయి.
దీంతో అధికారుల తీరుతో విసిగిపోతున్న రైతులు తామే స్వయంగా తలా కొంత డబ్బు కూడేసుకుని రిపేర్ చేయించుకుని తెచ్చుకుంటున్నారు. కొత్త టాన్స్‌ఫార్మర్లు లేదా అదనపు ట్రాన్స్ఫార్మర్లు అవసరమైన సందర్భాల్లో ఇచ్చే మెటీరియల్‌లో ప్రభుత్వం భారీ గా కోతలు విధించింది. కేసీఆర్ సర్కార్ హయాంలో 3 డీడీలు కడితే ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు వైర్లు, ఒక మెయిన్ పోల్‌తో పాటు ఐదు ఇతర పోల్స్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఒక మెయిన్ పోల్, ఇంకో సాధారణ పోల్ మాత్ర మే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మిగ తా మెటీరియల్ భారం రైతులపైనే పడుతోం ది. ఈ విషయాలన్నీ మండలిలో చర్చకు రావడంతో ప్రభుత్వ డొల్లతనం బట్టబయలైంది.
ఎవరికైనా ఫోన్ చేయండంటూ మంత్రికి ఎమ్మెల్సీ సవాల్
సోమవారం మండలిలో సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విద్యుత్ శాఖ దుస్థితిని ఏకరువు పెడుతూ…జిల్లాలో ఎవరికైనా ఫోన్ చేసి తెలుసుకోవాలంటూ మంత్రి భట్టికి సవాల్ విసిరినంత పనిచేశారు. మునుగోడులోనే ట్రాన్స్ఫార్మర్ల రిపేరింగ్ కేంద్ర ఉంది. ట్రాన్స్ఫార్మర్లు రిపేర్‌కు వస్తే రైతులే రూ.500, 1000 వేసుకుని ట్రాక్టర్లు పెట్టి ట్రాన్సఫార్మర్లు తీసుకెళ్లి బాగుచేయించుకుంటున్నరు. ఇలా రూ.10వేల నుంచి 15వేల వరకు రైతుల నెత్తినపడుతున్నయి కాలిపోతే రిపేర్ చేసేందుకు మూడునాలుగు రోజులు పడుతుంది. ఆ లోపు పంట ఎండిపోతుంది. దీనిపై అవసరమైతే ఇక్కడి నుంచే ఎవ్వరికైనా ఫోన్ చేయొచ్చు. వాస్తవాలేంటో తెలుస్తాయి. మండలి చైర్మన్‌ను అడగండి. ఆయన కూడా మా జిల్లానే అని పేర్కొన్నారు.
స్వరం కలిపిన మండలి చైర్మన్
ఎమ్మెల్సీ లేవనెత్తిన చర్చపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా స్వరం కలిపారు. ‘అధికారుల తీరుతో రైతులు వాళ్ల ట్రాన్స్ఫార్మర్లు వాళ్లే తెచ్చుకుంటున్నరు. దిమ్మెలు కట్టుకుంటున్నరు. వాస్తవంగా విద్యుత్తు శాఖ అధికారులే ఇవన్నీ చేయాలి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే కూడా అధికారులే తీసుకెళ్లి రిపేర్ చేయించాలి. కానీ ప్రాక్టికల్‌గా ఇవేవీ జరగడం లేదు. నేను మా ఊరిలో ఇట్లాంటి సమస్య వచ్చిన ప్రతీసారీ ఎస్ఈకి ఫోన్ చేసి రిపేర్ కోసం వాహనం పంపాలని చెప్పాల్సి వస్తోంది. నేనే స్వయంగా ఫోన్లు చేశా. ఎస్ఈకి, సబ్ స్టేషన్‌కు సంబంధించిన ఏఈకి కూడా ఫోన్ చేసి చెప్తున్నాం. ఇవన్నీ ఓ కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం అప్పజెప్తుంది. కానీ వాళ్లు సగం సగం పనులు చేస్తూ వదిలేస్తున్నారు. అని వివరించడంతో డిప్యూటీ సీఎంకు మింగుడుపడని అంశంగా మారింది.