మిర్యాలగూడ, ఆగస్టు 20: జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని, యూరియా పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయాధికారులను ఆదేశించారు. బుధవా రం ఆమె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో యూరియాపై స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి డివిజన్ పరిధిలోని వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంగళవారం రాత్రి జిల్లాకు 510 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఈ యూరియాను ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అవసరం ఉన్నంత మేర కేటాయించామన్నారు. యూరియా సక్రమ పంపిణీకి రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పంపిణీ చేయాలని, పంపిణీలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ఉన్న యూరియాను అవసరమున్న రైతులకే పంపిణీ చేయాలని ఆదేశించారు. పెద్ద రైతులు అనవసరంగా యూరియాను నిల్వ ఉంచుకోవద్దని, అవసరం ఉంటేనే తీసుకోవాలన్నారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో మొత్తం 19500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు సుమారు 14వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశామని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్ కలెక్టర్‌కు వివరించారు. యూరియాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వచ్చిన తరువాత సంబంధిత ఏవోలు, ఏఈవోలు అవసరం ఉన్న మేరకు రైతులకు ఇవ్వాలని అన్నారు.
యూరియా సక్రమ సరఫరాలో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, ముఖ్యంగా వాడపల్లి చెక్‌పోస్టు వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌ను ఆదేశించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌ను కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్లు సైతం ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాలను, గోదాములను తనిఖీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఇన్చార్జి ఏడీఏ సైదా నాయక్, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.