కండిషన్లో లేని వాహనాలు వెనక్కి పంపాలని నిర్ణయం ఫిట్నెస్ పరీక్షలు లేకుండానే నడిపిస్తున్న బస్సులు విద్యార్థుల సంరక్షణ బాధ్యత పాఠశాలల యాజమాన్యాలదే..
ఈ ఏడాది విద్యా సంవత్సర ప్రారంభ సమయం దగ్గర పడుతున్నది. ఈలోగా విద్యార్థుల రవాణాకు ఉపయోగించే ప్రైవేట్ పాఠశాలల బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి, ఆర్టీఏ అధికారుల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి గతనెల 15వ తేదీతో బడి బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసింది. గడువు దాటినా జిల్లాలో సగం పాఠశాలల యాజమాన్యాలు ఇంకా బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించలేదు. ఈ మేరకు జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయంలో పరీక్షలు కొనసాగుతున్నా యాజమాన్యాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
మోత్కూరు, జూన్ 8: ఆర్టీఏ అధికారులు సంబంధిత యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. గత విద్యా సంవత్సరం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించకుండానే కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సులు నడిపాయి. ఈ సారైనా అధికారుల కఠినంగా వ్యవహరిస్తేనే పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించుకునే అవకాశం ఉన్నది. జిల్లాలో 378 బస్సులు ఉండగా ఇందులో 229 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు గురువారం నాటికి పూర్తి చేసుకోగా ఇంకా 149బస్సులు పరీక్షలు చేసుకోవాల్సి ఉన్నది. ప్రైవేట్ విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ విషయంలో కొందరు అధికారులు ఉదాసీనంగా, ఏజెంట్లు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతేడాదిలో జిల్లాలో దాదాపు 150 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోకుండానే విద్యార్థులను తరలించారని తెలుస్తున్నది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అర్హత పత్రాలు తీసుకోవాల్సిన కొన్ని యాజమాన్యాలు వాహనాల రిపేరు ఇతర కారణాలతో ఫిట్నెస్ పరీక్షలు చేయించలేదు. విద్యా సంస్థల బస్సులన్నీ నిబంధనల ప్రకారం వసతులు కల్పించి ఫిట్నెస్ పరీక్షలు చేయించి విద్యార్థుల సంరక్షణ బాధ్యత తమదేనంటూ పాఠశాలల యాజమాన్యాలు రవాణా శాఖకు హామీ పత్రం సమర్పించాలి.
విద్యా సంస్థల బస్సులకు ప్రభుత్వం ప్రత్యేకంగా పసుపు రంగు గుర్తు కేటాయించింది. ఈ స్కూల్ బస్సుపై, కళాశాల/ పాఠశాల పేరు, ఫోన్, సెల్ నెంబర్‌తోపాటు పూర్తి చిరునామా బస్సు ఎడమ వైపు, ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా చేయాలి. ఏడాదిన్నర క్రితం 185వ చట్టం క్లాజ్(ఎఫ్), క్లాజ్ (జి) ప్రకారం విద్యా సంస్థల బస్సుల కోసం అదనపు నిబంధనలు జోడించారు.
60 ఏండ్లు దాటిన వ్యక్తిని డ్రైవర్‌గా నియమించుకోరాదు. పాఠశాల యాజమాన్యాలు బస్సు డ్రైవర్, బస్సుకు చెందిన పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. బస్సులో ఒక అత్యవసర ద్వారం ఉండాలి. దానిపై పెద్ద అక్షరాలతో అత్యవసర ద్వారం అని రాయాలి.
ప్రతి స్కూల్ బస్సులో అవసరమైన మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. బస్సులో తప్పకుండా యూనిఫాం ధరించిన ఒక అటెండర్‌ను ఉంచాలి. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల పూర్తి వివరాలు, విద్యార్థి ఎక్కాల్సిన, దిగాల్సిన ప్రదేశాలు నమోదు చేయాలి. బస్సులో ఉన్న విద్యార్థులు కిందికి దిగే సమయంలో డ్రైవర్‌కు వారు కనిపించేలా సైడ్ మిర్రర్ ఏర్పాటు చేయాలి. తయారీ సంవత్సరం నుంచి 15 సంవత్సరాలు మించరాదు. ప్రతి బస్సుకూ చేతి బ్రేక్, పూర్తి స్థాయిలో బీమా, రవాణా పన్ను చెల్లించి ఉండాలి. బస్సు అద్దాలకు ఆనుకుని అడ్డంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. నాణ్యమైన ఇంజిన్, స్టీరింగ్, రూఫ్, టైర్లు, తదితర ప్రభుత్వం గుర్తించిన పూర్తి సౌకర్యాలు కల్పించాలి. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తక్కువ ఎత్తులో సీట్లు బిగించాల్సి ఉన్నది.
ఫిట్ నెస్ పరీక్షలు లేకుండా పాఠశాలల బస్సులు రోడ్ల మీద తిరిగినా, విద్యార్థులను తరలించినా.. అలాంటి బస్సులను ఈనెల 15వ తేదీ నుంచి సీజ్ చేస్తాం. సీట్ల సంఖ్యకు మించి విద్యార్థులను తరలించినా, పూర్తి స్థాయి వసతులు కల్పించకపోయినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – సాయికృష్ణ, డీటీవో