నీలగిరి, ఏప్రిల్ 19 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 37నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఉక్కపోత ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండలు మండిపోతుండడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో చర్మ వ్యాధులు, వడదెబ్బ, మూత్ర పిండాల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్లు, గొంతు, ఒంటి నొప్పులు, చర్మం నల్లబారడం వంటివి వచ్చే అవకాశం ఉంది. వీటికి గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరు సంవత్సరాల్లోపు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు.
వేసవిలో వడదెబ్బ అతి ప్రమాదకరమైంది. మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పని చేయకపోవడం వల్ల ఇది వస్తుంది. సాధారణంగా వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్ హీట్. ఇంతకంటే ఎక్కువ అయితే (105 డిగ్రీల నుంచి 107 డిగ్రీల ఫారెన్ హీట్) దాటితే వడదెబ్బ వస్తుంది. మొదట తలనొప్పి, తల తిరుగడం, సరిగ్గా చూడలేకపోవడం జరుగుతుంది. రక్తపీడనం మామూలు కంటే తక్కువగా ఉంటుంది. శరీరం నుంచి చెమట కారుతుంది. ఈ సమయంలో వైద్యం అందకపోతే వ్యక్తి స్పృహ కోల్పోయి మరణించే ప్రమాదం ఉంటుంది.
వడదెబ్బ బారిన పడిన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి చేర్చి శరీరం మీద దుస్తులను తొలగించాలి. శరీరాన్ని తడి బట్టతో తుడిచి, తడి బట్టతో కప్పాలి. ఫ్యాన్ ఉంటే పెట్టాలి. శరీర ఉష్ణోగ్రత 101 నుంచి 102 డిగ్రీల ఫారెన్ హీట్ తగ్గే వరకు ఇలా చేయాలి. శరీర ఉష్ణోగ్రత మామూలు స్థితికి రాగానే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి చికిత్స అందించాలి.
వేసవిలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ, వేడి వల్ల సంభవించే వ్యాధులకు గురి కాకుండా ఉండవచ్చు. వాతావరణంలో వచ్చిన మార్పులతోపాటు ఉష్ణోగ్రతలు పెరుగడంతో చర్మ వ్యాధులు, వడదెబ్బ, డీ హైడ్రేషన్, మూత్రపిండాల్లో రాళ్లు, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. నీటిని బాగా తాగడంతోపాటు చలువ కోసం కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. శరీర నీటి శాతం పెంచే పుచ్చ, కర్బూజను బాగా తినాలి. మజ్జిగ బాగా తాగాలి. వేసవి దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 40వేల ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం.
– డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, నల్లగొండ