నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్10(నమస్తే తెలంగాణ) : భవ్యంగా, దివ్యంగా, దేవతామూర్తిని తలపిస్తూ చూడగానే చేతులెత్తి దండం పెట్టేలా ఉద్యమ కాలంలో కవులు, కళకారులు, సాహితీవేత్తల పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న అచ్చ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు భగ్గుమన్నారు. కేసీఆర్ దీక్ష ఫలించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన చారిత్రాత్మక విజయ్ దివస్ రోజు ప్రతిష్టను మసకబార్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని తీవ్రంగా తప్పు పుడుతున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు తెలంగాణ తల్లి విగ్రహాలు, చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలన్నింటినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. విగ్రహాలను శుభ్రపరిచి, పూలతో అలంకరించి పాలతో అభిషేకం నిర్వహించారు. మిగతాచోట్ల తెలంగాణ తల్లీ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యమ కాలంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లినే అంగీకరిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తెలంగాణ వ్యతిరేక చర్యలను సహించబోమని నినాదాలు చేశారు. మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు క్షీరాభిషేకంలో పాల్గొన్నాయి. బస్టాండ్ ఆవరణలో ఉద్యమ సమయంలో ప్రతిష్టించిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి పాలతో అభిషేకం చేశారు. నందికొండలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు. తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేశారు.
మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశాయి. ‘తెలంగాణ తల్లికీ జై.. అమరవీరులకు జోహార్లు, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశాయి. మర్రిగూడ, చండూరు, ఘట్టుప్పల్, పుట్టపాక, శాలిగౌరారం మండలం చిత్తలూరులో తెలంగాణ తల్లి విగ్రహాలు, ఫ్లెక్సీలకు బీఆర్ఎస్ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు.
ఉద్యమ కాలంలో రూపుదిద్దుకున్న అచ్చ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం రేవంత్‌రెడ్డి ఓర్వలేనితనానికి నిదర్శనమని మండిపడ్డారు. తిరిగి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్నే ప్రతిష్టించి తీరుతామన్నారు. ప్రజల జీవితాలు మార్చడానికి బదులు విగ్రహాలను, పేర్లను మార్చడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సరిపెడుతన్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్‌లు ఎద్దేవా చేశారు.
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యమ సమయంలో అన్ని వర్గాల ఆమోదంతో ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, సీనియర్ నాయకుడు వై.వెంకటేశ్వర్లు తదితరులు వందలాది మందితో బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేశారు. నేరేడుచర్ల, పాలకవీడు, మద్దిరాల, నూతనకల్, చివ్వెంల, హుజూర్నగర్, తుంగతుర్తి మండలాల్లోనూ కార్యక్రమాలు చేపట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మం డలం గుండ్లగూడెంలో నిర్వహించిన క్షీరాభిషేకంలో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, చౌటుప్పల్ పట్టణంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. భువనగిరిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యక్రమంలో అసెంబ్లీ పరిధిలోని నేతలంతా పెద్దఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మను తొలగించి, చెయ్యి గుర్తును పెట్టడం ఏంటని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ తల్లిని అంగీకరించేది లేదని కుండబద్ధలు కొట్టి చెప్పారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా, వాట్సాప్‌లో తెలంగాణ తల్లి ఫొటోలను డీపీగా పెట్టుకోవడం కనిపించింది