ఆత్మకూర్(ఎం), ఫిబ్రవరి 21 : ఎంఎస్ఎంఈ–ర్యాంప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రంలోని ఈడిసీ మేనేజర్ కుమ్మరికుంట్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో శనివారం ప్రధానమంత్రి ముద్ర యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఏల్వో ట్రైనర్ హేమాద్రి మాట్లాడుతూ.. ముద్ర రుణాలైన శిశు, కిషోర్, తరుణ్ వివరాలు, అర్హతలు, పత్రాలు, రీపేమెంట్, వ్యాపారం ఎలా చేసుకోవాలి, దాని విధి విధానాలపై అవగాహన కల్పించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ శివ రామకృష్ణ మాట్లాడుతూ.. అర్హులైన వారు సరైన పత్రాలతో బ్యాంకును సంప్రదిస్తే ముద్ర రుణాలు సులభంగా మంజూరు అవుతాయని తెలిపారు.
రుణాల విషయంలో బ్యాంకుల విధి విధానాలు, షరతులు వివరించారు. ఎంఎస్ఎంఈ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలు పెంచడమే లక్ష్యమని, వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఈడిసీ ని సంప్రదించాలని లీడ్ బ్యాంక్ ఆఫీసర్ వంశీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజరు ప్రశాంత్ కుమార్, ఈడీసీ అసిస్టెంట్ మేనేజర్ మహేష్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పల్లవి పాల్గొన్నారు.