Chiranjeevi | గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నారనే వార్తలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం ప్రభుత్వం చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయబోతుందంటూ పలు కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారంపై తాజాగా చిరంజీవి బృందం అధికారికంగా స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చింది. మెగాస్టార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిరంజీవి టీమ్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా నిరాధారమని, ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేకుండా వస్తున్న వార్తలను నమ్మవద్దని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఈ విషయాన్ని చిరంజీవి బృందం అధికారికంగా ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించింది. వాస్తవం కాని సమాచారాన్ని మరింతగా షేర్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. దీంతో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఇక సినిమాల విషయానికి వస్తే, రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘మెగా 158’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అలాగే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ‘మెగా 158’ టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆ రోజున మెగాస్టార్ అభిమానులకు ప్రత్యేక ట్రీట్ ఉండనుంది.మరోవైపు దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కూడా చివరి దశ పనుల్లో ఉంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. విడుదల తేదీపై అధికారిక ప్రకటన కూడా చిరంజీవి పుట్టినరోజు రోజునే వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు చిత్రాల తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.