Fire Accident | మేడ్చల్ : హైదరాబాద్ నగర శివారు మేడ్చల్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో రెండు ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి.
స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారుల కథనం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో పారిశ్రామిక వాడలోని 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన తాత్కాలిక షెడ్లలో ఏర్పాటు చేసుకున్న రెండు ఫర్నిచర్ దుకాణాల్లో మంటలు చెలరేగాయి. దుకాణాల్లో ఉన్న సోఫాలు, మ్యాట్రిసెస్ ల్లో ఉన్న ఫోమ్, రెగ్జిన్, కొబ్బరి నార కారణంగా కొద్ది సమయంలోనే మంటలు వ్యాపించి, రెండు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో మంటలను ఆర్పడంతో పక్కనే ఉన్న మరో దుకాణానికి ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదంలో రెండు ఫర్నీచర్ దుకాణాల్లోని ఫర్నీచర్ పూర్తిగా దగ్ధం కావడంతో దాదాపు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంటున్నారు. కాగా, స్థానిక పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.