– ఖమ్మం రూరల్ తాసీల్దార్ రాంప్రసాద్
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 21 : ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తే కటకటాల పాలు కాక తప్పదని ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ రాంప్రసాద్ హెచ్చరించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో ఉన్న ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో గత కొద్ది నెలలుగా ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన రెవెన్యూ అధికారులు తమదైన శైలిలో కబ్జాలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూములుగా బోర్డులు పెడుతున్నారు. తాజాగా శనివారం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు 101 సర్వే నెంబర్ టీఎన్జీవోస్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా బేస్మెంట్ లెవెల్ పునాదుల నిర్మాణం చేపట్టారు. చేపట్టడమే కాకుండా అమాయక ప్రజలను మోసం చేస్తూ వారికంటకట్టే ప్రయత్నానికి పాల్పడ్డారు.
విషయం తెలుసుకున్న ఖమ్మం రూరల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కే వి వి ప్రసాద్, క్రాంతి కుమార్, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరికృష్ణ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం జెసిబి సహాయంతో నిర్మాణాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వ స్థలంగా బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిపిఓలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా మలిచి కొందరు కబ్జారాయుళ్లు సొమ్ము చేసుకునే పనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు ప్రదేశాలలో కబ్జా చేసిన భూములను ప్లాట్లుగా మార్చి అమ్మకానికి పెట్టిన వారు కొందరైతే సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఉన్న పిల్ల కాలువలను కబ్జాలు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారు మరికొందరు. తాజాగా శనివారం రెవెన్యూ శాఖ అధికారులు ప్రకటించిన వివరాలు ప్రకారం సుమారు రూ.2 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్పా ప్రభుత్వ భూములకు రక్షణ ఉండదనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్ అధికారులు కబ్జాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

‘కబ్జాలకు పాల్పడితే కటకటాలు తప్పవు’