నల్లగొండ, మార్చి 12:కులవృత్తులకు జీవం పోసి ఆయా కుటుంబాలు ఆర్థిక పురోభివృద్ధి సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే ఒక విడుత అందించిన గొర్రెలు రెండు, మూడింతలు అయ్యాయి. లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారు. ఇక రెండో విడుత పంపిణీకి సర్కారు సన్నద్ధమైనది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించింది. మునుగోడు నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా నగదు బదిలీ ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టగా 5,600 మందికి యూనిట్లు అందించే కార్యక్రమం ఇటీవల ప్రారంభమైనది. నల్లగొండ జిల్లాలో మిగిలిన 27,782మందికి, సూర్యాపేట జిల్లాలో 17,642 మందికి గొర్రెలు అందనున్నాయి. పెరిగిన ధరలతో గొర్రెల యూనిట్ కాస్ట్‌ను సర్కారు రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచింది.
గొల్ల, కురుమల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2017 జూన్‌లో 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించినది. నల్లగొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీల్లో యాదవులు కుటుంబాలను ప్రభుత్వం ఆదేశాల మేరకు పశుసంవర్ధ్దక శాఖ యంత్రాంగం లెక్కించింది. ఇందులో 18ఏండ్లు పైబడిన వారు 66,132 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సర్కార్ సూచన మేరకు వీరికి రెండు విడుతలుగా అందజేయాలని తొలి విడుతగా 32,750 మందిని ఎంపిక చేసినప్పటికీ కొందరు డీడీలు చెల్లించక పోవడంతో 31,159 మందికి అందజేసింది. ఈ పథకం 2017 జూన్ 21న తొలుతగా నల్లగొండ మండలం గుట్ట కింది అన్నారం, అన్నారెడ్డిగూడేల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించి ఏడాదిన్నర కాలంలో 27,152 మందికి అందజేసి ఆ తర్వాత డీడీలు చెల్లించిన వారికి అందజేసింది. అయితే ఆ తర్వాత ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి రెండో విడుత నిలిచిపోగా తిరిగి వచ్చే నెల ఏప్రిల్‌లో ప్రారంభించి మిగిలిన లబ్ధ్దిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా సూర్యాపేట జిల్లాలో మొదటి విడుత 17,127 మంది పంపిణీ చేయగా, రెండో విడుత 17,642 మంది అర్హులను అధికారులు గుర్తించారు.
మునుగోడు నుంచే రెండో విడుత ప్రారంభం
2017లో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత 2018లో సర్వత్రా ఎన్నికల వల్ల ఆ పథకం తొలి విడుతతో ఆగింది. తిరిగి ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో మునుగోడు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో దాన్ని ఆ నియోజకవర్గం వరకు పూర్తి చేసి మళ్లీ ఆ పథకంలో పలు మార్పులు చేసి వచ్చే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా అమలు చేయాలని సర్కార్ యోచిస్తుంది. అయితే రెండో విడుతలో వాస్తవంగా 33,382 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు ఇవ్వాల్సి ఉండగా మునుగోడు నియోజకవర్గంలో ఇచ్చిన ప్రత్యక్ష నగదు బదిలీ లబ్ధ్దిదారులు 5,600 మంది పోను మరో 27,782 మందికి ఇవ్వనున్నారు. వీరికి యునిట్ కాస్ట్ రూ.1.75 లక్షలకు అందులో 25 శాతం వ్యక్తిగత కాంట్రిబ్యూషన్ రూ.43,750 డీడీ రూపంలో చెల్లించాల్సి ఉండగా మిగిలిన రూ. 31,250 ప్రభుత్వం సబ్సిడీ చెల్లించి ఇవ్వనుంది.
అంతకు మించిన పకడ్బందీతో పంపిణీ
గొర్రెల పంపిణీ విషయంలో ప్రతి ఇంట్లో 18 ఏండ్లు నిండిన వారిని ఎంపిక చేసిన ప్రభుత్వం ఈ సారి అంతకు మించిన ప్రణాళికలతో పకడ్బందీగా పంపిణీ చేసే అవకాశం ఉన్నదని పశు సంవర్ధక శాఖ అధికారులు అంటున్నారు. దీని కోసం ప్రత్యేక యాప్ ఇప్పటికే తయారు చేయగా దానిలో మరిన్ని మార్పులు చేసి ప్రతి లబ్ధ్దిదారుడు పక్కాగా గొర్రెలు కొనుగోలు చేయడంతో పాటు వాటిని దిగుమతి చేసుకొని వాటి ద్వారా వారి జీవన విధానం మెరుగు పరుచుకోవాలనేదే ఆలోచన. ప్రతి లబ్ధిదారుడికి 20 గొర్రెలతో పాటు ఒక పొట్టేలు ఇవ్వనుండగా వాటి కొనుగోలు స్థలం, లబ్ధిదారుడి, వాహనం ఫొటోలు, చెవి పోగు, కొనుగోలు, అమ్మకం దారులతో పాటు పశు సంవర్ధ్దక శాఖ అధికారుల ఫొటోలు తీసి సదరు యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రతి దశను జీపీఎస్ సిస్టమ్ ద్వారా పరిశీలించడంతో ఇంకా మరిన్ని నిబంధనలు పెట్టే అవకాశం ఉన్నది.
మెరుగైన గొల్ల,కుర్మల జీవన విధానం..
సబ్సిడీ గొర్రెల పంపిణీ జిల్లాలోని గొల్ల, కుర్మల జీవన విధానాన్ని మెరుగుపడుతున్నదని చెప్పవచ్చు. వివాహామైనా కాకపోయినా ఒకే ఇంట్లో తండ్రితో పాటు ఇద్దరు, ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ అందరిని పరిగణనలోకి తీసుకొని ఈ గొర్రెలు పంపిణీ కోసం ఎంపిక చేశారు. దీని ద్వారా ఇప్పటికే తొలి విడుతలో ఒకే ఇంట్లో ఒకటికి పైగా యూనిట్లు అందగా రెండో విడుతలోనూ అంద నున్నాయి. తొలి విడుతలో ఇచ్చిన ఈ గొర్రెల విస్తరణ ఈ ఐదేండ్ల కాలంలో ఎడెనిమిది రెట్లు పెరిగిందని అధికార యంత్రాంగం అంటుంది. వీటిలో కొన్నింటిని ఎప్పటికప్పుడే విక్రయించి ఆర్థ్దిక మూలాలు పెంపొందించుకోవడంతో వారి జీవన విధానం మెరుగైంది. అంతేగాక గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆ గ్రామాల నుంచి పట్టణాలకు మాంసం ఎగుమతి అవుతుంది. ఈ పథకం ద్వారా యాదవులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని సర్కార్ సర్వేలో తేలడంతో త్వరలో రెండో విడుత పంపిణీకి చర్యలు తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం గొర్రెల ధరలు పెరుగడంతో యూనిట్ కాస్టు గతాన్ని కంటే పెంచి పంపిణీ చేస్తున్నారు.
ఏప్రిల్‌లో పంపిణీ చేసే అవకాశం ఉన్నది
రెండో విడుత ఇప్పటికే మనుగోడు నియోజక వర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా అందచేసినప్పటికీ ఆ పద్ధతిలో కొన్ని ఇబ్బందులు రావడంతో దానిలో మళ్లీ మార్పులు చేసి ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మిగిలిన అన్ని ప్రాంతాల్లో వచ్చే నెల నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ రావాల్సి ఉంది. గతంలో కంటే పకడ్బందీ ప్రణాళికతో ఈ రెండో విడుత గొర్రెల పంపిణీ జరుగనుంది.
– యాదగిరి, పశు సంవర్థ్దక శాఖ అధికారి, నల్లగొండ