ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బడి బయటి పిల్లలపై సర్వే
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న 112మంది సీఆర్పీలు
6నుంచి 14, 15 నుంచి 19ఏండ్ల పిల్లల గుర్తింపు
పాఠశాలలు పునఃప్రారంభం కాగానే అడ్మిషన్లు
రామగిరి, మే 6 : బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్వే కొనసాగుతున్నది. బడి మానేసిన పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయడానికి 6నుంచి 14, 15నుంచి 19 ఏండ్లలోపు పిల్లల గుర్తింపునకు క్షేత్రస్థాయిలో 112 మంది సీఆర్పీలు పనిచేస్తున్నారు. 2021-22 విద్యాసంవత్సరంలో కొవిడ్ సమయంలో చేసిన సర్వేలోని అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వే కొనసాగిస్తున్నారు. అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం, విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. ఈ మేరకు ‘అందరూ చదువాలి.. అందరూ ఎదుగాలి’ నినాదంతో ముందుకు సాగుతున్నాయి. బడి బయట పిల్లలను గుర్తించి పూర్తి వివరాలను ఆన్లైన్లో (చైల్డ్ ఇన్ఫో)లో నమోదు చేస్తున్నారు.
సర్వే ఇలా…
తల్లిదండ్రులు చేస్తున్న పని, పిల్లలు బడికి వెళ్లకపోవడానికి గల కారణాలు, ఎంతవరకు చదివి మానేశారు..?’ తదితర వివరాలను పరిశీలిస్తారు. ఇదే క్రమంలో 2021-22 విద్యా సంవత్సరంలో కొవిడ్ నేపథ్యంలో చేసిన సర్వేలోని అంశాలు, గుర్తించిన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు..? అనే అంశాలను సైతం పరిశీలించాల్సి ఉంటుంది. ఆ ప్రకారం 2022-23 విద్యా సంవత్సరానికి గాను బడిబయటి పిల్లల వివరాలను పరిశీలించనున్నారు. గుర్తించిన పిల్లలను జూన్ 12న వేసవి సెలవుల తర్వాత బడులు పునఃప్రారంభం కాగానే బడిలో చేర్పించేలా విద్యాశాఖ పనిచేస్తుంది.
28 అంశాలతో ప్రొఫార్మా…
ఈ నెల 31వరకు బడి బయటి పిల్లల సర్వే పూర్తి చేయాల్సి ఉంది. విద్యార్థి పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, వయస్సు, ఫోన్ నంబర్, కుటుంబ జీవనాధారం, కులం, విద్యా స్థితి, ఏ తరగతి చదివారు.. తదితర వివరాలను నమోదు చేస్తూ 28 అంశాలతో కూడిన ప్రొఫార్మాను పూర్తి చేయాలి. ఒక వేళ బడి బయట ఉండి ఉంటే ఏప్రాంతంలో ఉన్నారో తెలియజేయాల్సి ఉంటుంది. సర్వే వివరాలను ఆయా కేంద్రాల ద్వారా జిల్లా విద్యాశాఖకు చేరవేయాలి.
నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి…
రాష్ట్ర విద్యాశాఖ సూచించిన గడువులోగా బడిబయటి పిల్లల సర్వేను ప్రతి సీఆర్పీ పూర్తిచేయాలి. ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేలా బడిబయటి పిల్లలందరికీ విద్యనందించేలా కృషి చేయాలి. పూర్తి చేసిన సర్వే ప్రొఫార్మాను సంబంధిత కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఈఓతో జిల్లా విద్యాశాఖకు అందచేయాలి. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే విద్యార్థులను బడిలో చేర్పించాలి.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
రోజువారీ వివరాలు అందజేయాలి..
బడిబయటి పిల్లల గుర్తింపునకు కొనసాగుతున్న సర్వే రోజువారీ వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా విద్యాశాఖకు అందించాలి. సీఆర్పీలు పటిష్టంగా సర్వే నిర్వహించి లక్ష్యాన్ని నేరవేర్చాలి. ముఖ్యంగా ఇటుక బట్టీలు, పరిశ్రమల ప్రాంతాల్లో బడి బయటి పిల్లలను గుర్తించాలి. 6నుంచి 14ఏండ్ల పిల్లలను పాఠశాలలో, 15నుంచి 19 ఏండ్ల పిల్లలను ఓపెన్ స్కూల్లో పదో తరగతిలో చేర్పిస్తాం.
– ఆర్.రామచంద్రయ్య, సెక్టోరియల్ అధికారి, నల్లగొండ