కుభీర్, మార్చి 16 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (కె) గ్రామంలో పశు వైద్యాధికారులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ ఎద్దు ప్రాణాల్ని కాపాడారు. గ్రామానికి చెందిన రైతు బందెల శంకర్‌కు చెందిన ఎద్దు నాలుగు రోజులుగా మూత్రం చుక్కలు చుక్కలుగా మాత్రమే పోస్తుంది. దీంతో దాని కడుపు తీవ్రంగా ఉబ్బిపోయింది.
ఇది గమనించిన రైతు శంకర్ వెంటనే పల్సి పశువైద్యాధికారిని సంప్రదించారు. అయినప్పటికీ పరిస్థితి మెరుపడలేదు. దీంతో భైంసా పట్టణ పశు వైద్యాధికారి గుంశెట్టి విఠల్‌కు సమాచారం అందించారు. సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని పార్డి (కె) గ్రామానికి వెంటనే వచ్చిన ఆయన రెండున్నర గంటల పాటు శ్రమించి, అక్కడే శస్త్ర చికిత్స నిర్వహించారు. మూత్రనాళాల్లో ఏర్పడిన రాళ్లను తొలగించి మూత్రాన్ని బయటకు పంపించేశారు.
మూత్రనాళాల్లో రాళ్లు వచ్చి మూత్రం ఆగిపోయి కడుపు ఉబ్బి అవస్థ పడుతున్న ఎద్దు ప్రాణాన్ని ఓ పశువైద్యాధికారి కాపాడారు. రెండున్నర గంటల పాటు శ్రమించి, ఆపరేరషన్ చేసి మూత్రాన్ని బయటకు పంపించేశారు. చావుబతుకుల మధ్య ఉన్న ఎద్దు లేచి నిలబడటంతో రైతు కుటుంబం ఆనందం వ్యక్తంచేసింది. సుమారు 70 వేల విలువైన ఎద్దును కాపాడిన డాక్టర్ విఠల్‌ను రైతులు అభినందించారు.
వేసవికాలంలో డీహైడ్రేషన్ కారణంగా పశువుల మూత్రనాళాల్లో రాళ్లు తయారవుతాయని డాక్టర్ విఠల్ తెలిపారు. అందుకే డీహైడ్రేషన్ కాకుండా మూడు పూటల ఉప్పు కలిపిన నీటిని తాగించాలన్నారు. రైతులు నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని సూచించారు.