హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 2026-27 వనమహోత్సవ కార్యక్రమం ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదు. మొక్కలు నాటడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడం, ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించడం లాంటి ఉన్నత ఆశయాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ, క్షేతస్థాయి లో గుంతల తవ్వకం, మొకల నాటే ప్రక్రి య, ఉపాధి హామీ కూలీలకు పనుల కల్పన లో తీవ్ర మందగమనం కనిపిస్తున్నది.
వనమహోత్సవంలో భాగంగా 2026-27లో రాష్ట్రవ్యాప్తంగా 618 లక్షల మొకలు నాటాలని లక్ష్యం నిర్దేశించగా.. పంచాయతీరాజ్ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 259 లక్షల మొకలు మాత్రమే నాటారు. తద్వారా మొత్తం లక్ష్యంలో 42 శాతమే పూర్తయింది. మొకలు నాటేందుకు 343.62 లక్షల గుంతలు తవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 229.10 లక్షల గుంతలు (67 శాతం) మాత్రమే తవ్వారు.
హైదరాబాద్, మేడ్చల్ మినహా రాష్ట్రంలోని మిగిలిన 31 జిల్లాలకుగాను కేవలం 5 (కామారెడ్డి, నిజామాబాద్, నాగర్కర్నూల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల) జిల్లాల్లోనే గుంతల తవ్వకం పూర్తయిం ది. మిగతా జిల్లాల్లో ఈ కార్యక్రమం చాలా మందకొడిగా సాగుతున్నది. ముఖ్యంగా జనగామలో 5%, కుమ్రం భీం ఆసిఫాబాద్ లో 11%, సూర్యాపేట జిల్లాలో 16%, రంగారెడ్డి లో 19%, వరంగల్లో 27% నిర్మల్లో 28%, నారాయణపేట జిల్లాలో 29% మాత్రమే గుంతల తవ్వకాలు జరిగాయి.
వనమహోత్సవంలో రాష్ట్రవ్యాప్తంగా ఇం టింటికీ మొక్కలు పంపిణీ చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని జిల్లాల్లో మొక్క ల పంపిణీ వేగంగానే జరుగుతున్నప్పటికీ మరికొన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ దాదాపు నిలిచిపోయినట్టే కనిపిస్తున్నది. ఇప్పటివరకు మహబూబాబాద్ జిల్లాలో 14 లక్షలు, నల్లగొండ జిల్లా లో 12.84 లక్షలు, జగిత్యాల జిల్లాలో 12.34 లక్షల మొక్కలు పంపిణీ చేశారు. జనగామ, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఒక్క మొక్క కూడా పంపిణీ కాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నామమాత్రంగా 6 వేల మొక్క లు పంచారు. జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ, ములుగు, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లో మొక్కల పంపిణీ 50 శాతానికిపైగా పూర్తయింది.
వనమహోత్సవం ద్వారా గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యం కాగితాలకే పరిమితమైనట్టు కనిపిస్తున్నది. గుంతల తవ్వకానికి, మొక్కలు నాటేందుకు 59.52 లక్షల పనిదినాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు కేవలం 14.44 లక్షల (24 శాతం) పనిదినాలను మాత్రమే సృష్టించారు. ఇంకా 45.08 లక్షల పనిదినాలను కల్పించాల్సి ఉన్నది. జనగామ, కుమ్రం భీం ఆసిఫాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, వరంగల్ లాంటి జిల్లాల్లో కనీసం 7% పనిదినాలను కూడా కల్పించకపోవడం ప్రభుత్వ సమన్వయ లోపాన్ని స్పష్టం చేస్తున్నది.
తెలంగాణలో పచ్చదనాన్ని, అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ‘హరితహారం’ గ్రాండ్ సక్సెస్ అయిం ది. నాడు ఊరూరా రోడ్డుకు ఇరువైపులా మొ క్కలు నాటి, వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు కూడా చేపట్టారు. ప్రతి మొక్కకూ ట్రీగార్డ్ ఏర్పాటు చేసి, ఆ మొక్కలకు నీళ్లపోసేందుకు పంచాయతీలో ట్యాంకర్ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో అత్యధిక శాతం మొక్కలు బతికి ఇప్పుడు నీడను ఇస్తున్నాయి.
