ICU blaze : ఆస్పత్రి ఐసీయూ (Hospital ICU) లో అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. రోగులను ఐసీయూ నుంచి బయటికి తీసుకువెళ్లే క్రమంలో పలువురు సిబ్బందికి కూడా కాలిన గాయాలయ్యాయి. ఒడిశా (Odisha) లోని కటక్ సిటీ (Cuttak city) లోగల ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కటక్‌లోని ఎస్సీబీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ట్రామా కేర్ విభాగం ఐసీయూలో ఆదివారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది రోగులు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అదేవిధంగా ఈ అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ తెల్లవారుజామున 2.30 నుంచి 3.00 గంటల మధ్య సమయంలో ప్రమాదం జరిగిందని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. మంటలు చెలరేగగానే తాము రోగులను ఐసీయూ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశామని తెలిపారు.
ఘటన సమయంలో ఐసీయూలో ఆ పక్కన ఉన్న వార్డులో మొత్తం 23 మంది రోగులు చికిత్స పొందుతున్నారని, వారిని తరలిస్తుండగా అప్పటికే ఏడుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారని, మరో ముగ్గురు తరలించే క్రమంలో మృతిచెందారిని ఐసీయూ సిబ్బంది వెల్లడించారు. ఐసీయూ నుంచి రోగులను తరలించే క్రమంలో సిబ్బందిలో కూడా 11 మంది గాయపడ్డారని తెలిపారు.