మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వివిధ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో అండగా నిలుస్తున్నది. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి పథకాలతోపాటు షీటీమ్స్, సఖి కేంద్రాల ద్వారా విశేష సేవలు అందిస్తున్నది. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కానుక ఇస్తున్నది. ఇకపై ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ పేరుతో స్త్రీలకు ప్రత్యేకంగా వైద్య సేవలను అందించనున్నది. ఉచితంగా పరీక్షలు చేసి, మందులు అందించనున్నది. అవసరమైతే రెఫరల్ ఆస్పత్రులకు పంపించనున్నది. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలను ఎంపిక చేసింది. అక్కడ విధుల్లో డాక్టర్లు, స్టాఫ్ కూడా మహిళలే ఉండనున్నారు. త్వరలో మరిన్ని ఆస్పత్రులకు ఈ సేవలు విస్తరించనున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఎంపిక చేసిన ఆస్పత్రులివే..గుండాల పీహెచ్సీ, భువనగిరి హనుమాన్వాడ బస్తీ దవాఖాన, డిండి పీహెచ్సీ, మర్రిగూడ పీహెచ్సీ, వేములపల్లి పీహెచ్సీ, కట్టంగూర్ పీహెచ్సీ, నిడమనూరు పీహెచ్సీ, కేశరాజుపల్లి బస్తీ దవాఖాన, నేరేడుచర్ల పీహెచ్సీ, త్రిపురారం పీహెచ్సీ, కుడకుడ బస్తీ దవాఖాన, అంబేద్కర్‌నగర్ యూపీహెచ్సీ, పెన్‌పహాడ్ పీహెచ్సీ
యాదాద్రి భువనగిరి, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పేరుతో కొత్త కార్యక్రమానికి నాంది పలుకనున్నది. ఇందులో భాగంగా మహిళలకు ముందస్తుగా పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించనున్నది. ఇందుకోసం ప్రతి మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి ఉండనున్నాయి. ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానల్లో ఈ కార్యక్రమం అమలు కానున్నది. ఈ కార్యక్రమం ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం నుంచి నాన్‌స్టాప్‌గా కొనసాగనుంది. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ వైద్య సేవలు అందనున్నాయి. ఆస్పత్రుల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కోసం జిల్లా వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.
57 రకాల వైద్య పరీక్షలు
సాధారణంగా మహిళలు ఎదుర్కొనే 8 రుగ్మతలకు సంబంధించి స్క్రీనింగ్, పరీక్షలు, చిక్సిత చేయనున్నారు. ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో షుగర్, బీపీ, రక్తహీనత వంటి వాటికి సాధారణ పరీక్షలతో పాటు లక్షణాల మేరకు సుమారు 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్‌తోపాటు పీసీఓడీ, రుతుస్రావ సమస్యలు, మైక్రో న్యూట్రియంట్ డెఫీషియన్సీ, వెయిట్ మేనేజ్మెంట్, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ మేనేజ్మెంట్, ఇన్ ఫర్టిలిటీ మేనేజ్మెంట్, మోనోపాజ్ మేనేజ్మెంట్, ఐవీ, థైరాయిడ్, విటమిన్ డీ-3, బీ-12 డెఫీషియన్సీ వంటి వాటిని ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ చేయనున్నారు. దాంతో పాటు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. 24 గంటల్లోనే రిపోర్టులను అందిస్తారు. అవసరమైన వారిని రిఫరల్ ఆస్పత్రులకు పంపిస్తారు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ మెడికేషన్, కౌన్సెలింగ్ ఇస్తారు. బరువుకు సంబంధించి యోగా, వ్యాయామంపై అవగాహన కల్పించి, సూచనలు చేయనున్నారు. వైద్యం కోసం వచ్చే మహిళల వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో పొందుపర్చనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను కూడా రూపొందించారు. ఆస్పత్రి రిఫరల్ లింక్‌లు కూడా ఇందులో ఉంటాయి.
తగ్గనున్న ఆర్థిక భారం..
ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ సేవలు అందుబాటులోకి రానుండటంతో అతివలకు మేలు జరుగనుంది. ప్రస్తుతం ప్రైవేట్‌లో వైద్య సేవలు పొందితే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తున్నది. అవసరం లేకున్నా అడ్డగోలు పరీక్షలు రాసి, పైసలు గుంజుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు సర్కారే నేరుగా మహిళలకు అనేక రకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు ఉచితంగా మందులు ఇవ్వనుండటంతో కుటుంబంపై ఆర్థిక భారం తగ్గనుంది.
ఉమ్మడి జిల్లాలో 13 ఆస్పత్రులు
మహిళలకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆస్పత్రులను ఎంపిక చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని 13 ఆస్పత్రులను గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండాల, భువనగిరి పట్టణంలోని హన్మాన్‌వాడ బస్తీ దవాఖాన, నల్లగొండ జిల్లాలోని డిండి, మర్రిగూడ, వేములపల్లి, కట్టంగూరు, నిడమనూరు, కేశరాజుపల్లి బస్తీ దవాఖాన, సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల, త్రిపురారం, సూర్యాపేట పట్టణంలోని కుడకుడ బస్తీ దవాఖాన, యూపీఎస్సీ అంబేద్కర్‌నగర్, పెన్‌పహాడ్ ఆస్పత్రుల్లో సేవలు ప్రారంభంకానున్నాయి.
ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నాం
ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఆరోగ్య మహిళ పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నది. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా సేవలు అందించనున్నాం. డాక్టర్లు, స్టాఫ్ అందరూ అతివలే ఉంటారు. మొదటి విడుతగా జిల్లాలో రెండు ఆస్పత్రులను గుర్తించారు. వీటిలో వైద్య సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది మహిళలకు మంచి
అవకాశం.
-మల్లికార్జునరావు, డీఎంహెచ్ఓ, యాదాద్రి భువనగిరి