యాదాద్రి భువనగిరి, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దశాబ్ది వేడుకల్లో భాగంగా అమరులను గుర్తు చేసుకుంటూ భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఉదయం 8.30గంటలకు కలెక్టర్ హన్మంతు జెండగేతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి కలెక్టరేట్లో కలెక్టర్ జెండగే జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత ఆయన ప్రసంగిస్తారు. ఇందుకోసం కలెక్టరేట్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్లోని పరిపాలనా భవనాన్ని విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇక హైదరాబాద్‌లో ఆదివారం జరిగే దశాబ్ది ఉత్సవాలకు జిల్లాలోని అమరుల కుటుంబాలు తరలివెళ్లనున్నాయి. 29 కుటుంబాలను అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించగా, వారిని వివిధ వాహనాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
వేడుకల సందర్భంగా భువనగిరి ఖిలాను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఖిలా చుట్టు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రే ట్రయల్ రన్ వేశారు. శనివారం రాత్రి విద్యుత్ కాంతులతో ఖిలా ధగధగ మెరిసిపోయింది. చాలాకాలం తర్వాత భువనగిరి ఖిలా కొత్త శోభ సంతరించుకుంది. కరెంట్ వెలుగులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఏర్పాట్లను మున్సిపల్, స్పోర్ట్స్, టూరిజం అధికారులు పర్యవేక్షించారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఉద్యమకారులు, ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. రెండోరోజు ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, అనాథ శరణాలయాలు, పలు సంస్థల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తులు పండ్లు, స్వీట్లు, పంపిణీతోపాటు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు.