తిరుమలగిరి నవంబర్ 11: పత్తి రైతుకు కష్టకాలం వచ్చిపడింది. ఎన్నో ఆశలతో తెల్లబంగారాన్ని సాగు చేసిన రైతన్నలకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఇటీవల కురిసిన వర్షాలు.. కూలీల కొరత వెరసి చేతికొస్తుందనుకున్న పంటం తా చేలలోనే మురిగిపోతోంది. ఈ సారి జిల్లా వ్యాప్తం గా 93 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఆలస్యంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా పొం తన లేని నిబంధనలు పెట్టి, తేమ పేరుతో కొనుగోలు చేయక పోవటంతో మద్దతు ధర దక్కక పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా వర్షాల కారణంగా ప్రస్తుతం ఎకరాకు 3, నుంచి 4 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. పత్తి దిగుబడి సగానికి పైగా పడిపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
కాంగ్రెస్ సర్కారు తీరుతో పత్తి రైతులు దివాలా తీసే పరిస్థితి దాపురించింది. లాభం దేవుడెరుగు పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పులు మిగులుతున్నాయి. ఎకరా పత్తి పండించేందుకు సుమా రు రూ.30 నుంచి రూ .35 వేల వరకు పెట్టుబడి అవుతుంది. పత్తి తీతకు మరో రూ.15 వేలు అవుతుంది. మొత్తంగా ఎకరాకు రూ.45 వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. సగటున ప్రస్తుత పరిస్థితుల్లో 3 నుంచి 4 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. ప్రభుత్వ మద్దతు ధర రూ.8110 వచ్చినా ఎకరాకు రూ.15 వేల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తే క్వింటాల్‌కు రూ.6 వేలకు మించి పైసా కూడా ఎక్కువ రావటం లేదు. దీంతో ఎకరాకు రూ.20 వేల వరకు పత్తి రైతులు నష్టపోవాల్సి వస్తోంది.
జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా తేమ శాతం..నాణ్యత లేదంటూ కొర్రీలు.. ప్రభుత్వ మద్దతు ధర పొం దాలంటే తేమ 8శాతం కంటే మించరాదని ప్రతి 1 శాతానికి రూ. 81.10 ధర తగ్గుతుంది. తేమ శాతం 12 కంటే మించితే సీసీఐ ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చెయ్యదు. 8 శాతానికి రూ. 8110, 9% రూ.8028, 10శాతానికి రూ.7947.80, 11శాతానికి రూ. 7866.70, 12శాతానికి రూ. 7785,60గా నిర్ణయించారు. ఆపై తేమ ఉంటే సీసీఐలో కొనుగోలు చేపట్టరు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 12శాతం తేమ ఉన్నా మద్దతు ధర చెల్లించారని రైతులు చెబుతున్నారు. నిబంధనల పేరుతో సీసీఐ పత్తి కొనుగోళ్లు చేయక పోవటంతో రైతులు అవసరాలను ఆసరా చేసుకొని దళారులు గ్రామాల్లో వాలిపోతున్నారు. స్థానికంగా ఉన్న కొంత మం ది పల్లెల్లో తిరుగతూ రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు.
బస్తా తూకం పేరిట క్వింటాకు 2 కిలోలు అదనంగా తీసుకోవడమే కాకుండా 3 నుంచి 5 కిలోల వరకు మోసగిస్తున్నారు. పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8110 ఉండగా..బాగా లేద ని సీసీఐకి వెళ్తే అసలే కొనరని మాయమాటలు చెప్పి రూ .5వేల నుంచి 6వేల లోపే కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ నిబంధనల ప్రకారం లైసెన్సు కలిగిన వ్యాపారులే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. కానీ దానికి భిన్నంగా బాట్లు, గొలుసు కాంటాలతో తూకాలు వేస్తూ ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేస్తూ అక్రమంగా డబ్బు గడిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ పత్తి కొనుగోలు కేంద్రాలు పుట్టుగొడుగుల్లా పుట్టుకొచ్చి రైతులను దగా చేస్తున్నా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో తమ కేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దళారులను కట్టడి చేయాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మీరు మార్కెట్ వరకు వెళ్లాలంటే ఎంతో ఖర్చవుతుంది. రూ.100 తక్కువగా మాకే విక్రయిస్తే వెం టనే చేతిలో డబ్బులు పెడతాం అంటూ దళారులు ఆశ చూపుతున్నారు. కొద్దిమంది రైతులు నాణ్యత ఉన్నా కూడా పంటను తక్కువ ధరకే తెగనమ్ముకుంటున్నారు. జిల్లాలో పత్తి విషయంలో ఇలాంటిది ఎక్కువగా కనిపిస్తోంది. నేడు ఏ గ్రామానికి వెళ్లినా దళారులు కొనుగోలు చేసిన పత్తిని వీధుల్లో లారీల్లోకి ఎక్కిస్తుండటం కనిపిస్తోంది.
మాయమాటలతో దళారులు రైతులను మాయచేస్తున్నారు. క్వింటా పత్తిని కాంటా వేస్తే అదనంగా 2 కిలోలు దోచేస్తున్నారు. మామూలుగా అయితే బస్తాతో కాంటా వేస్తుండగా సదరు బస్తా 300 గ్రాములకు మించి ఉండదు. దీంతో పాటు గొలుసు కాంటాలను వినియోగిస్తూ 2 నుంచి 5 కిలోల వరకు అదనంగా తూకాలు వేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెటింగ్ శాఖ నిబంధనల ప్రకారం ట్రేడింగ్ లైసెన్స్ కలిగిన వ్యాపారులే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. విధిగా ఎలక్ట్రానిక్ కాంటాలనే వాడాలి. కానీ బాట్లు, కాంటాలను తూనికలు, కొలతల శాఖ అధికారుల ముద్రలు లేకుండానే లైసెన్స్ లేని వ్యాపారులు, దళారులే ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నారు.
మాది నాగారం మండలం వర్దమాన్కోట. పదెకరాలు కౌలుకు తీసుకొని ఈ సారి పత్తి సాగు చేసా. వర్షాలకు పత్తి దిగుబడి తగ్గి పూర్తిగా నష్టపో యా. అక్టోబర్ చివరి వారం వరకు సీసీఐ కేంద్రాలు లేక చేతికి అందిన పత్తి గ్రామాల్లోనే వ్యాపారులకు క్విం టాకు రూ . 6,500 కే విక్రయించా. మొత్తం పెట్టుబడి ఖర్చు రూ. 7 లక్షలయితే వచ్చింది రూ. 84 వేల 500. పదెకరాలకు పెట్టుబడి ఖర్చు రూ.4 లక్షల 70 వేలు వచ్చింది. కౌలు లక్షా 80వేలు ,130 మంది కూలీలను పెట్టి ఒక్కొక్కరికి రూ.350 కూలీ ఇచ్చి పత్తి తీయిస్తే 13 క్వింటాల పత్తి దిగుబడి వచ్చింది. సీసీఐ లేక గ్రామాల్లో వ్యాపారులకు విక్రయిస్తే క్వింటాకు 6500 చొప్పున కొనుగోలు చేశారు. దీంతో రూ. 84వేల 500 వందలు వచ్చాయి. కనీసం కౌలు డబ్బులు కూడా తీరలేదు. రెండో విడతలో 5 క్వింటాలు పత్తి కూడా వస్తదో లేదో.. మొత్తంగా అన్ని ఖర్చులు కలిసి రూ. 7లక్షల వరకు వస్తే, పంట విక్రయిస్తే రూ.లక్ష వచ్చిన దుస్థితి ఇది. ఇక రైతులు బతికేది ఎట్లా ? గతంలో పండుగలా చేసుకున్న వ్యవసాయం ప్రస్తుతం గుదిబండలా మారింది. రైతులు ఆర్థికంగా కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి.
– నర్సింగ్ ఎల్లాగౌడ్, రైతు, వర్దమాన్కోట, నాగారం