రామగిరి, డిసెంబర్ 11 : మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (పీఎంటీఏ-టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ అన్నారు. సమస్యలపై ప్రభుత్వానికి, విద్యాశాఖ కమిషనర్, మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్‌కు వేర్వేరుగా గత నెల 22న సమ్మె నోటీసులను పీఎంటీఏ-టీఎస్ ఆధ్వర్యంలో అందజేశారు. 15రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీగా ఆందోళనతో సమ్మె చేస్తామని పేర్కొన్నారు.
అయినా అధికారులు, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఈ నెల 10న వారు చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలతో మరో నోటీస్, వినతి అందజేశారు. ఈ క్రమంలో ఈ నెల 12నుంచి దశల వారీగా ఆందోళన చేస్తూనే జనవరి 4న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆందోళనలో ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని జగదీశ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 32 మోడల్ స్కూళ్లలో 520 మంది ఉపాధ్యాయలు విధులు నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 17 పాఠశాలల్లో 270 మంది, సూర్యాపేట జిల్లాలో 9 పాఠశాలల్లో 150, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు పాఠశాలల్లో వంద మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరంతా ఆందోళన బాట పట్టనున్నారు.