యాదాద్రి, ఫిబ్రవరి 3 : గిల్లికజ్జాలు.. గిచ్చి పంచాయతీలు పెట్టుకోవడమే బీజేపీ నైజమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా అంతకంటే దీటుగా, గట్టిగా బీజేపీ నాయకులకు సమాధానం చెప్పాలని యువతకు మంత్రి పిలుపునిచ్చారు. గుట్ట పట్టణంలో గురువారం నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నదని విమర్శించారు. ఒక అబద్ధాన్ని 100సార్లు చెప్పి ప్రచారం చేస్తుందని తెలిపారు. అసత్య ప్రచారాలను టీఆర్ఎస్ యువత తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఎక్కడికక్కడే సమాధానం చెప్పాలన్నారు. ఆలేరుకు మరోసారి వచ్చి యువతకు సోషల్ మీడియాపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. 95శాతం స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకే సీఎం కేసీఆర్ 317 జీఓ తెచ్చారన్నారు.
ఇక యాదాద్రి జిల్లా ఉద్యోగాలు యాదాద్రి యువతకే దక్కనున్నాయని తెలిపారు. అన్నిచోట్ల ఖాళీలు, ఉద్యోగ అవకాశాల కోసమే ఉద్యోగుల విభజనను ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.32లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 70వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి చేసింది శూన్యమన్నారు. రాష్ట్రంపై కేంద్రం ప్రభుత్వానికి చిన్న చూపేనన్నారు. రాష్ట్రంలో బీజేపీకి నైతికత లేదన్నారు. సమావేశానికి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య స్వాగతోపన్యాసం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ శంకరయ్య, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, యువజన విభాగం పట్టణాధ్యక్షుడు సతీశ్ యాదవ్, యువజన విభాగం మండలాధ్యక్షుడు ఎండీ.అజ్జు, నాయకులు మిట్ట వెంకటయ్య, కసావు శ్రీనివాస్, అంకం నర్సింహ, బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడె మహేందర్, ఆలేరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల యువజన, విద్యార్థి విభాగం, సోషల్‌మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
యాదాద్రికి ఆర్ఆర్ఆర్ రోడ్డుతో జిల్లాకు మహర్దశ రానుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునః నిర్మాణంతో నృసింహ స్వామి జలాశయం, పర్యాటకాభివృద్ధితో జిల్లా రూపురేఖలు మారబోతున్నాయని అన్నారు. రాబోవు రోజుల్లో యాదాద్రికి భక్తుల తాకిడి పెరుగబోతున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి కోరిక మేరకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి యాదాద్రిలో వంద పడకల ఆస్పత్రి మంజూరు కృషి చేస్తామని తెలిపారు.
నియోజకవర్గవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి యువతలో నూతనోత్సాహాన్ని నింపుతామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గడపగడపకు సంక్షేమ పథకాలను అందుతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ముమ్మరంగా ప్రచారం చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ గ్రామగ్రామానికి రూ.25లక్షల నిధులు మంజూరు చేశారని ప్రతి గ్రామానికి వెళ్లి గ్రామాలకు అభివృద్ధికి యువత ముందుండాలని చెప్పారు.
ఒక్కప్పుడు తాను మీలాగే యువకుడిలా కష్టపడి తిరగడంతో సీఎం కేసీఆర్ గుర్తించి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచాం చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలి.
సీఎం కేసీఆర్ స్థానికంగా ఉన్న యువతకు అక్కడే ఉద్యోగవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో 317జీఓ తెచ్చారని, దీంతో యువతకు స్థానికంగానే ఉద్యోగాలు వస్తాయని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో యువత ముందుండాలన్నారు. సోషల్ మీడియా కన్వీనర్లు ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నాయకుల నిరాధారమైన ఆరోపణలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.