ముంబై, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో అంతర్ రాష్ట్ర అండాశయ అక్రమ రవాణా ముఠా గుట్టు బయటపడింది. ఈ కేసులో 300 మందికి పైగా పేద మహిళలు బాధితులుగా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ ముఠా ఒక్కో అండాశయానికి రూ.20 వేలు చెల్లిస్తున్నట్లు పోలీసులు శనివారం గుర్తించారు. ఈ రాకెట్లో ప్రధాన నిందితురాలితో సహా ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రధాన నిందితురాలు సులక్షణ గడేకర్ బద్లాపూర్‌లోని పేద మహిళలను డబ్బుతో ఆకర్షించి వారి అండాశయాలను అమ్మమని బలవంతం చేసేది. పేద మహిళల నుంచి సేకరించి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో విక్రయించేది. ప్రధాన నిందితురాలి ఇంట్లో సోదా చేసినప్పుడు తప్పుడు అఫిడవిట్లు, మహిళల ఫోటోలు, అనుమానాస్పద పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.