స్నేహం అనేది జీవితంలో లభించే అత్యంత విలువైన బంధాలలో ఒకటి. ఇది నమ్మకం, అవగాహన, దయ, మధురమైన జ్ఞాపకాల పునాదిపై నిర్మితమవుతుంది. సంస్కృతులు, తరాలు, సరిహద్దుల్ని దాటి వ్యక్తులను అనుసంధానించే శక్తి స్నేహానికి మాత్రమే ఉంది. ఒక నిజమైన తోడు మన జీవితంలోని ప్రతి సవాలును తేలికగా, ప్రతి వేడుకను మరింత ఉత్సాహంగా మారుస్తుందని స్నేహం మనకు గుర్తు చేస్తుంది. ప్రతి ఏడాది వచ్చే ఫ్రెండ్ షిప్ డే మన కష్టసుఖాల్లో మనతో పాటు నిలిచిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది.
ఐక్యరాజ్యసమితి జూలై 30వ తేదీన ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్రెండ్ షిప్’ను నిర్వహించగా, భారత్ సహా పలు దేశాలు ఆగస్టు నెలలోని మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకొంటాయి. ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టడం, మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన వేడుకగా మారింది. మీ చిన్ననాటి స్నేహితుడైనా, కాలేజీ రూమ్మేట్ అయినా, ఆఫీస్ సహోద్యోగి అయినా వారు అందించే మద్దతుకు కృతజ్ఞతలు చెప్పడానికి ఫ్రెండ్షిప్ డే సరైన సమయం. ఈ ఫ్రెండ్షిప్ డేకు మీ ఆత్మీయ మిత్రుడికి ఈ కొటేషన్లతో శుభాకాంక్షలు తెలపండి.