సూర్యాపేట, జూలై 9 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియ ద్వారా ఏ ఒక్కరి ఓటు కూడా పోదు.. ఎవ రూ ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు.. అందరికీ నేను అభయం ఇస్తున్నానని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ఓటు హక్కు ఉండాలంటే ప్రతిఒక్కరూ కచ్చితంగా ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలకు అందించాల్సిందే. ఎవరికైనా..ఒకే చోట ఒక్కటి మాత్రమే ఓటు ఉంటుంది.. దీనికి ఎవ్వరూ అతీతులు కాదు. ఎవరికైన అనుమానాలు ఉంటే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమంపై ప్రజ ల్లో పలు అనుమానాలు, భయాలపై నమస్తే తెలంగాణతో కలెక్టర్ ముచ్చటించి, ప్రజల అనుమానాలను నివృత్తి చేశారు.
నమస్తే: గడువు ముగిసినా ఎన్యుమరేషన్ పత్రాలు అందలేదంటున్నారు..?
కలెక్టర్: ఈ విషయంలో ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. జిల్లాలో ఇప్పటివరకు 99 నుంచి 100శాతం ఎన్యుమరేషన్ పత్రాలను అందించాం. ఒకవేళ ఎవరైనా ఇండ్ల వద్ద లేకున్నా… వేరే ఇతర ప్రాంతాలకు వెళ్లినా వారికి అందకపోవచ్చు. అలాం టి వారు బీఎల్వోలను సంప్రదించి ఫారాలు తీసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్లోనే పూర్తి వివరాలు ఫీడ్ చేసి సబ్మిట్ కొడితే ఆన్లైన్ ద్వారానే బీఎల్వోలకు అందుతుంది.
నమస్తే: 2002 జాబితాలో పేరు లేని వారి పరిస్థితి ఏంటి..?
కలెక్టర్: 2002 ఓటరు జాబితాలో పేరు లేని వారి ఓటు ఎటూపోదు. అలాంటి వారి తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్ల ఓటరు జాబితాతో మ్యాచ్ చేస్తారు. ఒక వేళ వారి పేర్లు కూడా లేనిపక్షంలో అలాంటి వారు ఎన్యుమరేషన్ ఫారంలోని మూడో కాలం మాత్రమే పూర్తి చేసి బీఎల్వోలకు అందించాలి. తదనంతరం ఒక నోటీసు వస్తుంది.. దాని ప్రకారం ఆధార్‌కార్డుతో పాటు ఇతర గుర్తింపు కార్డులు ఇస్తే ఓటు హక్కు ఉంటుంది.
నమస్తే: ఒక్కరికి రెండు ఓట్లు ఉంటే ఎలా..?
కలెక్టర్: వాస్తవానికి ఇది క్రైం కిందకే వస్తుంది. రాజ్యాంగం అంగీకరించదు. ఎవరికైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు ఉంటే సర్ ద్వారా కచ్చితంగా తొలిగించడం జరుగుతుంది. ఎన్యుమరేషన్ ఫారాలను ఎక్కడో ఒక చోటనే తీసుకొని నింపి ఇవ్వాలి. ఎవరైనా రెండు చోట్ల అందజేస్తే డిజిటలైజేషన్ ప్రక్రియలో దొరికిపోతారు..తస్మాత్ జాగ్రత్త.
నమస్తే: గడువు దగ్గర పడుతుంది..ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుంది..?
కలెక్టర్: నెమ్మదిగా ఏం లేదు…బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్ పత్రాలు తీసుకుంటున్నారు. డిజిటలైజేషన్ చేయడం కాస్త ఆలస్యం అవుతున్నందున, బీఎల్వోలకు సహకరించేలా సహాయకులను నియమించాలని ఆర్డీవోలు ఇతర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే చాలా చోట్ల నియమించారు. రెండు మూడు రోజుల్లో అవసరం ఉన్న ప్రతి చోట సహాయకులను నియమించి గడువులోపే పూర్తి చేస్తాం.
నమస్తే: సర్‌పై ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారు..?
కలెక్టర్: సర్ ప్రక్రియ అనేది సర్వసాధారణమైనది. ఎవరూ ఎలాంటి అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకొని నింపి బీఎల్వోలకు ఇవ్వాలి. కాస్త డిజిటల్ పరిజ్ఞానం ఉన్నా ఆన్లైన్లో voters.eci.gov.in ద్వారా లాగిన్ అయి వివరాలను నింపి సబ్మిట్ కొడితే నేరుగా బీఎల్వో లాగిన్లోకి చేరిపోతుంది. సర్‌పై ఎవరికైనా ఎలాంటి అనుమానాలు ఉన్నా కలెక్టరేట్లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశాం. హెల్ప్‌డెస్క్ 6281492368, ఎలక్షన్ డీటీ భరత్ 9573085943తోపాటు ఐటీ సపోర్టర్ రణదీప్ 9059170790 నెంబర్లకు కాల్ చేసి అనుమానాలను నివృత్తి చేసుకొని ఎన్యుమరేషన్ ఫారాలను నింపి బీఎల్వోలకు అందించాలి. మళ్లీమళ్లీ గుర్తు చేసే విషయం ఏంటంటే ఏ ఓటరు జాబితాలో పేరు ఉన్నా.. లేకున్నా.. కచ్చితంగా ఎన్యుమరేషన్ ఫారాలను నింపి బీఎల్వోలకు అందించాలి. ఎవరి ఓటు ఎక్కడికి పోదు.