కోదాడ, సెప్టెంబర్ 01 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేసి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ సూర్యనారాయణకు అందించారు. రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి వీడి యూరియాను సరఫరా చేయాలన్నారు.
అదేవిధంగా అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేలు, యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ వెంటనే చెల్లించడంతో పాటు రూ.2 లక్షల పైన ఉన్న వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జాతీయ నాయకులు దొడ్డ వెంకటయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, మాతంగి ప్రసాద్, గెల్లి పుల్లయ్య, రాజు, భూక్య గోపాల్, నాగేశ్వరరావు, నరసింహారావు, కొండయ్య పాల్గొన్నారు.