కట్టంగూర్, డిసెంబర్ 20 : విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటే శారీరకంగా, మానసికంగా ఎదుగుతారని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌష్టికాహార ప్రదర్శన స్టాల్స్‌ను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పద్మావతితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. జంక్ ఫుడ్ తినడం వల్ల విద్యార్థుల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకునేందుకు పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమం ఎంతగానో దోహద పడుతుందన్నారు.
ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై విద్యాపరంగా తమ పిల్లల ప్రగతి తెలుసుకోవాలన్నారు. పాఠశాలలో సమస్యలుంటే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని కోరారు. విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి రాగానే తల్లిదండ్రులు వారిని చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎంఏ.గపూర్, చిన్ని శ్రీనివాస్, పంతంగి విఠల్, కుమార్, తేజస్విని, జయమ్మ పాల్గొన్నారు.