రామగిరి, డిసెంబర్ 02 : విద్యార్థుల నుండి సేకరించిన నగదును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ కాలేజీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నల్లగొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ విద్యార్థుల నుండి టాస్క్ పేరుతో రూ.3 లక్షలు వసూలు చేశారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, బీటెక్ కాలేజీ ప్రధాన గేటు వద్ద అఖిలపక్ష విద్యార్థి సంఘాలు మంగళవారం ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ, బీసీ సంఘం, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులపై ఆర్థిక భారం మోపే చర్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ అంశంపై విశ్వవిద్యాలయం పూర్తిస్థాయి విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకుని విధుల్లో నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణే తమ లక్ష్యమని, విచారణ పూర్తయ్యే వరకు తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు వాడపల్లి నవీన్, బీసీ సంఘం నాయకులు కరుణాకర్, ఎస్ఎఫ్ఐ రవి, స్వేరో స్టూడెంట్ యూనియన్ సురేశ్, పీడీఎస్‌యూ నాయకులు హర్ష, తదితరులు పాల్గొన్నారు.