‘కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులే. ఆరు గ్యారంటీలు అని చెప్తున్న ఆ పార్టీ నేతలు.. అధికారంలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్, ఇతర రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదు. కర్ణాటకలో 24గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ
ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.500 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1200కు పెంచిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
దేవరకొండ, అక్టోబర్ 28 : పధ్నాలుగేండ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని.. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో చీకట్లో ఉన్న రాష్ర్టాన్ని నిరంతర వెలుగులోకి తీసుకొచ్చారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ చీకట్లు అలుముకుంటాయన్నారు. శనివారం పట్టణంలో సాయిరమ్య ఫంక్షన్హాల్లో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత నాలుగేండ్లుగా కనిపించని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు వచ్చి పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తున్నారని, వారిని తిరస్కరించాలని కోరారు. తెలంగాణ పోరాటంలో ప్రజల సమస్యలను గుర్తించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటి ఐదేండ్లు సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలోనే అన్ని రాష్ర్టాలు అబ్బుర పడేలా తెలంగాణను తీర్చి దిద్దారన్నారు.
కరోనా సమయంలో పేద ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని కాంగ్రెస్ నాయకులకు ఓట్ల ముందు ప్రజలు గుర్తుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఎన్నికల ముందు 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక చేతులెత్తేసిందని, ప్రస్తుతం 2 గంటలు కూడా సక్రమంగా ఇస్తలేరని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని మంత్రి అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్ రాష్ర్టాల్లో ఎందుకు ఇవ్వడం లేదని మంత్రి ప్రశ్నించారు. ప్రధాని మోదీ పుణ్యమాని రూ.500 ఉన్న గ్యాస్ ధర నేడు రూ.1200కు చేరిందన్నారు. సీఎం కేసీఆర్ మూడోసారి అధికారం చేపట్టగానే రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. రైతుబంధును రూ.15వేలకు పెంచుతామన్నారు.
రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలల ద్వారా ప్రతి పేద వాడికి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని మంత్రి చెప్పారు. ఎలాంటి ఆధారం లేని మహిళలకు రూ.3వేలు, ఆసరా పింఛన్‌ను రూ.5వేలకు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి ద్వారా రూ.1,0116 అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాల డబ్బులు నాయకుల జేబుల్లోకి వెళ్తాయని, అదే సీఎం కేసీఆర్ మూడోసారి అధికారం చేపడితే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి చెప్పారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు వ్యాపారాలు, కాంట్రాక్టులు లేవని, ఆయన కేవలం ప్రజా సేవకే పరిమితమయ్యారన్నారు. ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేసే నాయకుడు రవీంద్రకుమార్‌ను 50 వేల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ రూ.6,349 కోట్లతో డిండి ఎత్తిపొతల పథకం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మరో రూ.600 కోట్లతో ఐదు లిఫ్ట్‌ల పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నియోజకవర్గంలో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పట్టణంలో రూ.100 కోట్ల నిధులతో రహదారులు, అండర్ డ్రైనేజీ పనులు పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ప్రతి ఆవాసంలో గ్రామంపంచాయతీ భవనాలు నిర్మించి పాలన అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31న జరిగే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రానున్నారని, నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు బారీగా తరలిరావాలని పిలుపు నిచ్చారు. నాలుగేండ్లు నియోజకవర్గంలో కనిపించని కాంగ్రెస్ నాయకులు, బ్యాంకులు దోచుకున్న వ్యక్తులు ఎన్నికలు రాగానే మళ్లీ ఓట్ల కోసం ప్రజల ముందుకు వస్తున్నారని, వారికి ఎందుకు ఓటు వేయాలో ప్రశ్నించాలని సూచించారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు తిరస్కరించినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. బీఆర్ఎస్ నాయకుడు గుత్తా అమిత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేతావత్ బిల్యానాయక్, ఎంపీపీలు మాధవరం సునీతాజనార్దన్రావు, వంగాల ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్‌రెడ్డి, ముత్యాల సర్వయ్య, లోకసాని తిరుపతయ్య, రాజీనేని వెంకటేశ్వర్రావు, దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, రమావత్ దస్రూనాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, ఉజ్జిని విద్యాసాగర్‌రావు, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు పల్లా ప్రవీణ్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, బీఆర్ఎస్ నాయకులు మల్రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, భగవంత్‌రావు, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌గౌడ్, జడ్పీటీసీ సలహాదారుడు మారుపాకుల సురేశ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గాజుల ఆంజనేయులు, నీల రవికుమార్, వైస్ చైర్మన్ రహత్‌అలీ, కౌన్సిలర్లు రైస్, ఇలియాస్, తౌఫిక్, చిత్రం ప్రదీప్ పాల్గొన్నారు.