ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మన ఊరు – మన బడికి శ్రీకారం
తొలి విడుతలో 1,097 పాఠశాలల ఎంపిక
రూ.399 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
163 పాఠశాలల్లో పనులు ప్రారంభం
నెలాఖరుకు మండలానికి కనీసం రెండు బడులు సిద్ధం!
మిగిలిన పాఠశాలల్లో ఈ నెల 15లోగా ప్రారంభం
ఇంగ్లిష్ మీడియం నేపథ్యంలో బడిబాటకు విశేష స్పందన
ఆరు రోజుల్లోనే 6,318 అడ్మిషన్లు
కార్పొరేట్ చదువుల కాలంలో నిరుపేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి, మన బస్తీ మన బడిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా వసతులు సమకూర్చి, ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నది. అందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలి విడుతలో 1,097 పాఠశాలలను ఎంపిక చేయగా, 163 స్కూళ్లలో ఇప్పటికే అభివృద్ధి పనులు ప్రారంభించింది. మొత్తంగా ప్రభుత్వం రూ.399కోట్లను కేటాయించింది.
ఈ నెలాఖరుకు మండలానికి కనీసం రెండు పాఠశాలల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు ముందుకు సాగుతున్నారు. మిగిలిన పాఠశాలల్లో ఈ నెల 15లోగా పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తుండడంపై బడి బాటలో ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సర్కారు కల్పిస్తున్న ధీమాతో ఆరు రోజుల్లోనే 6,318 అడ్మిషన్లు నమోదవడం విశేషం.
నల్లగొండ జిల్లాలో మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి ప్రణాళిక
రామగిరి, జూన్ 9 : సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగా మన ఊరు-మనబడి, మన బస్తీ -మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా స్కూళ్లలో గదులు, వసతుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కార్పొరేట్‌కు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కార్యాచరణ కొనసాగుతున్నది. త్వరలో స్కూళ్లు ప్రారంభం కానుండడంతో జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. మన ఊరు.. మన బడి కార్యక్రమంలో చేపట్టే పనులను ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తుండగా స్థానిక పాఠశాలల ఉపాధ్యాయులు వాటి వివరాలను పిల్లల తల్లిదండ్రులకు తెలియజేస్తూ అడ్మిషన్లను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్లం
మన ఊరు-మన బడిలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 8వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమం అందుబాటులోకి తెస్తున్నారు. దానికి సంబంధించిన మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ నెల 3నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న బడిబాటలో తల్లిదండ్రులు, ప్రజలకు ఫ్రభుత్వ ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు.
బడిబాటలో 6,318 అడ్మిషన్లు
బడిబాటలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 6,318 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందగా ఆ వివరాలు ఎప్పటికప్పుడు విద్యాశాఖ వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 1403 మంది, సూర్యాపేట జిల్లాలో 1,573 మంది, యాదాద్రిభువనగిరి జిల్లాలో 3,342 మంది అడ్మిషన్లు తీసుకున్న వారిలో ఉన్నారు. ముఖ్యంగా నూతన అడ్మిషన్లు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలతోపాటు కొన్ని ప్రైవేట్ బడుల నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు ప్రభుత్వ బడిలో చేర్పిస్తున్నట్లు విద్యాశాఖాధికారులు వెల్లడిస్తున్నారు.
తొలి విడుతలో 1,097 పాఠశాలలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,150 ప్రభుత్వ పాఠశాలలుండగా మన ఊరు-మన బడి కార్యక్రమం తొలి విడుతలో 1,097 పాఠశాలను ఎంపిక చేశారు. వీటిలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు రూ.399 కోట్ల్లు అవసరమని ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేసి కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌కు నివేదిక సమర్పించారు. వీటికి ప్రభుత్వ అనుమతులు కూడా రావడంతో నిధులు మంజూరయ్యాయి.
దేవరకొండలోని జంగాల కాలనీ ప్రభుత్వ పాఠశాలలో మనఊరు-మనబడి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
బొమ్మలరామారం ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మనబడి అభివృద్ధి ప్రణాళికను పరిశీలిస్తున్న జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి
73 పాఠశాలల్లో ప్రారంభమైన పనులు
నల్లగొండ జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఇప్పటికే 73 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. మరో 131 పాఠశాలల్లో అభివృద్ధి పనులకు 15శాతం నిధులను సర్కార్ కేటాయించింది. దాంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా తుర్కపల్లి మండలం గోపాల్పురంలోని పాఠశాలలో ప్రారంభమైన పనులు
12 అభివృద్ధి పనులు..
మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో 12 రకాల అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఇంజినీరింగ్ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టే పనులను స్కూల్ మానిటరింగ్ కమిటీ(ఎస్ఎంసీ) చైర్మన్, హెచ్ఎం ఆధ్వర్యంలో అంచనా వేసి కలెక్టర్‌కు నివేదించారు. ఇప్పటికే పలుచోట్ల వీటిన పనులకు శంకుస్థాపనలు జరుగగా మరికొన్ని చోట్ల కొనసాగుతున్నాయి. ఈ నెల 15 వరకు అన్ని పాఠశాలల్లో పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ, నూతన గదులు, వంట గదులు, డైనింగ్ హాళ్లు, గ్రీన్ బోర్డులు, పెయింటింగ్స్, విద్యుత్, ఫర్నిచర్, ల్యాబ్స్ ఇతర మౌలిక వసతులు సమకూర్చుతారు. రూ. 30 లక్షల అంచనాతో ఉన్న పనులను ఎస్‌ఎంసీల ఆధ్వర్యంలో చేపట్టి, అంతకుమించితే టెండర్ ప్రక్రియ ద్వారా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
అందుబాటులో అందరికీ ఆంగ్ల విద్య
మన ఊరు-మనబడి, మన బస్తీ-మన బడిలో భాగంగా కలెక్టర్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం పనులు ప్రారంభించాం. ఇప్పటికే 73 పాఠశాల్లో పనులు ప్రారంభం కాగా మిగిలిన పాఠశాలల్లో త్వరలోనే మొదలవుతాయి. ఈ కార్యక్రమం పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎనిమిదో తరగతి వరకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలోనే పాఠాలు చెప్తారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా విద్యాశాఖ ముందుకు సాగుతున్నది.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
బడులకు మహర్దశ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
దేవరకొండ, జూన్ 9 : కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమని ఎమ్మెల్యే దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలో జంగాలకాలనీ, గాంధీనగర్, వడ్డెరవాడ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మనఊరు- మనబడి కార్యక్రమంలో రూ.63 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. మూడేండ్లలో మూడు దశల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, పేరెంట్స్ కమిటీలు, పూర్వ విద్యార్థుల భాగస్వామంతో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్‌నాయక్, కౌన్సిలర్లు చెన్నయ్య, ముడావత్ జయప్రకాశ్‌నారాయణ, మహ్మద్ రెయిస్, మల్లేశ్వరీశ్రీశైలంయాదవ్, చిత్రం ప్రదీప్, ఎంపీడీఓ శర్మ, కమిషనర్ వెంకటయ్య, ఎంఈఓ మాతృనాయక్, ఏఈ లష్కర్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు
జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి
బొమ్మలరామారం ప్రాథమిక పాఠశాల
బొమ్మలరామారం, జూన్9 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మంజూరైన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి ప్రణాళికను పరిశీలించి వాటిలో కొన్ని మార్పులు చేయాలలి పంచాయతీ రాజ్ ఏఈ సూర్యానికి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు సహకరించాలన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సింహ, సర్పంచ్ రాంపల్లి మహేశ్‌గౌడ్, ఉపసర్పంచ్ జూపల్లి భరత్, ఎంపీటీసీ మైలారం ఈదమ్మ, ఎంపీడీఓ సరిత, జీఏహెచ్ఎం ఉపేంద్ర, హెచ్ఎం వెంకటలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి పద్మజ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్ గౌడ్, దండు యాదగిరి, బోయిని నర్సింహ, మల్లేశ్, ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మణ్, శ్రీధర్ పాల్గొన్నారు.