యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ-2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తూ.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను ప్రకటించింది. ఆ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,268 పోస్టులు ఖాళీలు భర్తీ చేయనున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 277 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ 84, లాంగ్వేజ్ పండిట్ 21, పీఈటీ 2, సెకండరీ గ్రేడ్ టీచర్ 137, స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేటర్లు) 10, సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేటర్లు) పోస్టులు 23 ఉన్నట్లు పేర్కొంది.
నల్లగొండ జిల్లాలో 605, సూర్యాపేటలో 386 ఖాళీలను భర్తీ చేయనున్నది. కాగా, పాత డీఎస్సీ నోటిఫికేషన్ను ప్రభుత్వం బుధవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నది. అప్లికేషన్ ఫీజును వెయి రూపాయలుగా నిర్ణయించింది. ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన తేదీలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్నది. గతంలో దరఖాస్తు చేసుకున్నోళ్లు మళ్లీ చేయాల్సి అవసరం లేదని, కొత్త డీఎస్సీకి పాత దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటామని నోటిఫికేషన్ పేర్కొంది.