మత్స్యకారులకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేసింది. కొత్త పథకాలు అమలు చేయకపోగా.. ఉన్న పథకాలకు పాతర వేస్తున్నది. ఉచిత చేపల పిల్లల పంపిణీని కుదించింది. గతేడాదితో పోలిస్తే చెరువుల్లో నీళ్లు లేవనే సాకుతో ఈసారి సీడ్‌ను సగానికి సగం తగ్గించింది. దాంతో మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోనున్నారు. మంగళవారం నుంచి జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం వృత్తిదారులకు ఊతం ఇచ్చింది. మత్స్యకారులు ఎదిగేందుకు అన్ని రకాలుగా అండగా నిలిచింది. గతంలో ఏ ప్రభుత్వంలోనూ లేనివిధంగా వంద శాతం సబ్సిడీతో ఉచిత చేపల పిల్లలను అందించింది. మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. 2016లో ఈ ప్రారంభమైన కార్యక్రమం గతేడాది వరకు నిర్విరామంగా కొనసాగింది. ఎనిమిది విడుతలుగా ఉచిత చేప పిల్లలు పంపిణీ చేపట్టింది. ఉచిత చేప పిల్లల పంపిణీతో ఏటా ఉత్పత్తి పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది మాత్రం కాంగ్రెస్ సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీపై ఫోకస్ పెట్టలేదు. ఇప్పటికే చెరువుల్లోకి సీడ్ వదలాల్సి ఉండగా, ఇంకా టెండర్లు పూర్తి కాలేదు.
కేసీఆర్ హయాంలో సక్రమంగా సాగిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ సర్కారులో చతికిలాపడింది. ఈసారి ఉచిత చేప పిల్లల పంపిణీ సగానికి తగ్గించారు. జిల్లాలో రెండు రకాల చేప పిల్లలను చెరువుల్లో వేసేవారు. గతేడాది 3 కోట్ల చేప పిల్లలను చెరువుల్లోకి వదిలారు. అందులో రూ.2 కోట్లు పెద్ద చేప పిల్లలు, కోటి చిన్న పిల్లలు ఉన్నాయి. కానీ ఈ సారి మాత్రం 1.5 కోట్లకు కుదించారు. ఇందులో 80మిల్లీమీటర్ల సైజ్ ఉన్న చేపల పిల్లలు కోటి కాగా, 35 మిల్లీమీటర్ల సైజ్‌వి 50 లక్షలు వేయాలని నిర్ణయించారు. పెద్ద సైజ్‌కు టెండర్లు పూర్తయ్యాయి. చిన్న వాటికి టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో సుమారు 800కిపైగా చెరువులు ఉన్నాయి. కొన్నేండ్లుగా కొన్ని చిన్న చెరువులు పోగా.. ఏటా 650 చెరువుల్లో చేప పిల్లలను వదులుతున్నారు. ఈసారి పరిస్థితి మారింది. 450 చెరువుల్లోనే సీడ్ వేయాలని సర్కారు నిర్ణయించింది. చెరువుల్లో నీరు లేకపోవడంతో చెరువుల సంఖ్యతోపాటు సీడ్ తగ్గిందని అధికారులు చెబుతున్నారు. సీడ్ వేయాలంటే మినిమమ్ సీడ్ ఉండాలని చెప్పుకొస్తున్నారు. నారాయణపురం, కాచారం, మాసాయిపేట తదితర చెరువుల్లో నీళ్లు లేవని తెలియజేస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనలో మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడికతీత చేపట్టారు. దాంతో చెరువులు జలకళను సంతరించుకుని నిండుకుండలా తొణికిసలాడాయి. ఉచిత చేపల పిల్లల పంపిణీతో ఎంతో మందికి ఉపాధి లభించింది. మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కకుననారు. జిల్లాలో 186 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. వాటి ద్వారా 10వేల మంది వరకు మత్య్సకారులు జీవనోపాధి పొందుతున్నారు. వీరే కాకుండా సభ్యత్వాలు లేనివారు, పరోక్షంగా మరికొందరికి ఉపాధి లభిస్తున్నది. కానీ ఇప్పుడు చెరువులు, సీడ్ సంఖ్య తగ్గడంతో మళ్లీ మత్స్యకారుల ఉపాధికి గండి పడనున్నది. తక్కువ సీడ్‌తో లాభాలు కూడా తగ్గిపోనున్నాయి.
ఉచిత చేప పిల్లల పంపిణీకి మంగళవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయపల్లిలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేప పిల్లలను చెరువులోకి వదలనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం జిల్లా మత్స్యశాఖ అధికారి రాజారాం చెరువులను పరిశీలించారు. అవసరమైన ఏర్పాట్లు చేశారు.