నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్30(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నల్లగొండ, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల, మద్దిరాల, రామన్నపేట, పోచంపల్లి, ఆలేరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అత్యధికంగా కట్టంగూర్‌లో 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం సుమారు రెండు గంటల పాటు కురిసింది. వర్షం కురుస్తున్నంత సేపు పట్టణంలో కరెంటు సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. బుధవారం సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉన్న సమాచారం మేరకు… ఉమ్మడి జిల్లా పరిధిలోని సుమారు 30 మండలాల్లో వర్ష ప్రభావం కనిపించింది.
10.2 సెంటీమీటర్ల వర్షపాతంతో కట్టంగూర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. తర్వాత నల్లగొండలో 4.6 సెంటీమీటర్లు, నార్కట్‌పల్లిలో 4.0, చిట్యాలలో 2.8, సూర్యాపేట జిల్లాలోని మద్దిరాలలో 4.2, మేళ్లచెర్వులో 1.6 సెంటీమీటర్ల వర్షం పడగా.. మోతె, నూతనకల్, అనంతగిరి, అర్వపల్లి, నాగారం, తుంగతుర్తి, నడిగూడెం తదితర మండలాల్లో ఓ మోస్తరు కురిసింది. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్‌లో అత్యధికంగా 3.0 సెంటీమీటర్లు, రామన్నపేటలో 2.9, పోచంపల్లిలో 2.3, వలిగొండ, ఆలేరులో 1.8 సెంటీమీటర్ల చొప్పున, మోటకొండూర్‌లో 1.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మోత్కూరు, రాజాపేట, భువనగిరి, తుర్కపల్లి, అడ్డగూడూరు తదితర మండలాల్లోనూ వర్ష ప్రభావం కనిపించింది.
ప్రస్తుతం ఉమ్మడి జిల్లా అంతటా వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా పత్తి పంట కూడా ఏరుతున్నారు. ఈ క్రమంలో కురిసిన వర్షంతో ఆయా మండలాల్లోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లే. కోతలకు సిద్ధంగా ఉన్న వరి పంట ఈ వర్షంతో పలుచోట్ల నేలవాలింది. ఇదే సమయంలో ఈదురుగాలులు వీయడంతో వడ్లు కూడా నేలరాలినట్లు తెలుస్తున్నది. ఇక మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు సైతం తడిసిపోయాయి. నల్లగొండ, కట్టంగూర్, నార్కట్‌పల్లి, రామన్నపేట తదితర మండలాల్లోని ఐఏపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసినట్లు తెలిసింది. నల్లగొండ పక్కనే ఉన్న ఆర్జాలబావి కేంద్రంలో భారీగా వడ్లు వచ్చి ఉన్నాయి. వర్షానికి ఈ వడ్లు తడవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. తిరిగి వడ్లను ఆరబెట్టి తేమశాతం 17 వస్తేనే కొనుగోలు చేయనున్నారు.
ఇలాంటి పరిస్థితి మిగతా చోట్ల కూడా నెలకొంది. ఇక పత్తి రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఇటీవల తరుచుగా కరుస్తున్న వర్షంతో చేలపైన ఉన్న పత్తి నాణ్యత దెబ్బతిన్నది. తాజాగా బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతోనూ ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తి చేలపైనే తడిసి ముైద్దెంది. ఇప్పటికే పత్తి పంటకు మద్దతు ధర లభిస్తున్న పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆలస్యంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా వాటిల్లోనూ కొనుగోళ్లు ఊపందుకోలేదు. పత్తిలో తేమశాతం 8 వరకు ఉంటేనే సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేస్తారు. కానీ వర్షాలతో చేలపైనే పత్తి తడవడంతో తేమశాతం 15 నుంచి 20శాతం వరకు ఉంటుండడంతో సీసీఐ కొనుగోలు చేయడం లేదు. దీంతో మరో ప్రత్యామ్నాయం లేక రైతులు గ్రామాల్లోని దళారులను ఆశ్రయించి అమ్ముకుంటున్నారు. దీని వల్ల క్వింటాలుకు 5,800 నుంచి 6,500 రూపాయలకు మించి ధర రావడం లేదు. సుమారు క్వింటాలుకు వెయ్యి రూపాయల వరకు పత్తి రైతు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. తడిసిన ధాన్యం లేదా పత్తిని తేమ శాతంతో సంబంధం లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.