నీలగిరి, మే 14: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు పండించిన ప్రతి గింజనూ పది నుంచి పదిహేను రోజుల్లో కొనుగోలు చేయాలని పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో భాగంగా గురువారం ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి జిల్లాలో పర్యటించారు. ముందుగా కనగల్ మండలం చెట్ల చెన్నారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం స్థానిక రైసు మిల్లుకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయడంతో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఇందుకోసం 8,575 కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పా టు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరించి, 1800 రైసు మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేశామని మంత్రి చెప్పారు.
కొనుగోళ్లకు రూ.22 వేల కోట్లు
రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం రూ.22 వేల కోట్లు కేటాయించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇప్పటివరకు 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.4800 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. మిగిలిన ధాన్యం కొనుగోలుకు వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ధాన్యం సేకరణలో రవాణా, హమాలీల సమస్య తీవ్రంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటిని స్థానికంగా అధిగమిచేందుకు కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఇస్తున్నామన్నారు. సమస్యను పరిష్కరించి పది పదిహేను రోజుల్లో ధాన్యం సేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాన్స్‌పోర్టుకు సంబంధించి ఏమైనా సమస్య ఉంటే రవాణా శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ పూర్తి చేయాలన్నారు. మారుమూల గ్రామాల్లో రైతు పండించిన ప్రతి చివరి గింజనూ కొనుగోలు చేసి 48 నుంచి 72 గంటల్లో డబ్బులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నిధుల కొరత లేదు..
ప్రభుత్వం దగ్గర నిధుల కొరత లేదని, ఎన్ని డబ్బులైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. మిల్లర్లకు రావాల్సిన డబ్బులను ఇప్పటికే రూ.48 కోట్లు చెల్లించామని, ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానికంగానే పరిషరించుకోవాలన్నారు. అందుకు సంబంధించి, ఎంత డబ్బు ఖర్చయినా ఆయా సమస్యను కలెక్టర్లు బాధ్యతగా తీసుకొని పరిషరించాలన్నారు. ఆ డబ్బును కలెక్టర్ ఖాతాలో రిఫండ్ చేస్తామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎకడా లేని విధంగా రాష్ట్రంలో అధిక మొత్తంలో వరి దిగుబడి రావడం జరిగిందన్నారు. అందుకు తగినట్టుగానే రూ.22వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. మిల్లుల్లో ధాన్యం అన్‌లోడింగ్‌కు సంబంధించి ఇబ్బందులు వస్తున్నందున గతంలో పలు అక్రమాలకు పాల్పడి బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లులను మినహాయించి ధాన్యం కేటాయించి సేకరణ వేగవంతం చేశామన్నారు. అన్‌లోడింగ్‌లో సమస్య వస్తున్నందున ప్రతి మిల్లుకూ ప్రత్యేక అధికారిని నియమించి వేగంగా అన్లోడ్ అయ్యేలా చూడాలన్నారు. ఈనెల 25 లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
15 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి..
జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి 15 రోజుల్లోగా పూర్తి చేసే విధంగా అధికారులు యంత్రాంగం యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టాలన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 60 నుంచి 70 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు. గత వానకాలం సీజన్‌కు సంబంధించి మిల్లర్లు సీఎంఆర్ ఇప్పటివరకు 45 శాతం మాత్రమే ఇచ్చారని, వాటిని పూర్తి స్థాయిలో వసూలు చేస్తే మిల్లుల వద్ద ధాన్యం నిల్వలకు మరింత స్థలం దొరుకుతుందన్నారు. అంతకుముందు ధాన్యం కొనుగోలుకు సంబంధించి మూడు జిల్లాల్లో చేపట్టిన చర్యలపై ఆయా జిల్లా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ చాంబర్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ స్టీపెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు వీరేశం, లక్ష్మారెడ్డి, జయవీర్‌రెడ్డి, బాలూనాయక్, సామేల్, అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, కలెక్టర్లు చంద్రశేఖర్, తేజస్ నందలాల్ పవార్, అనురాగ్ జయంతి, ఎస్పీలు శరత్చంద్ర పవార్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.