ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం పడే బాధ చెప్పలేనిది. అప్పటివరకూ కష్టసుఖాల్లో కలిసి ఉన్న మనిషిని కోల్పోయిన దుఃఖం గుండె లోతుల్లో నుంచి తన్నుకొస్తుంది. కడచూపు కోసం వచ్చిపోయే వాళ్లు, అంతిమ సంస్కారాల ఏర్పాట్లతో ఒక శ్మశాన నైరాశ్యం ఆవహిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సొంతిల్లు ఉంటే సరే. కానీ, కిరాయి ఇళ్లయితే! ఓనరుకు పట్టింపులు
ఉండి, శవాన్ని మా ఇంట్లో ఉంచొద్దని ఖరాకండిగా చేప్తే!! అప్పుడు ఆ కుటుంబానికి దారేది? తల దాచుకునేందుకు ఇంత జాగలేని వారికి దిక్కేది? చాలా సున్నితమైన ఈ సమస్యకు పరిష్కారంగా సూర్యాపేట మహాప్రస్థానంలో ప్రత్యేక భవనం నిర్మాణమవుతున్నది. అద్దె ఇంట్లో ఉండే వారెవరైనా చనిపోతే ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మహాప్రస్తానం దిగువ భాగంలో ఈ నిర్మాణానికి పునాది రాయి వేశారు. సూర్యాపేట పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీమన్నారాయణ మృతి అనంతరం ఆ కుటుంబం పడిన బాధలు చూసి చలించిన మంత్రి.. రూ.86 లక్షల వ్యయంతో పెద్ద హాలు, పై అంతస్తులో మూడు పోర్షన్లతో నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. దహన సంస్కారాలు మొదలు.. దశదిన కర్మ పూర్తయ్యే వరకు ఇక్కడ బాధిత కుటుంబానికి ఆశ్రయం
కల్పించడంతోపాటు వారికి అవసరమయ్యే వంట సామగ్రిని అందుబాటులో ఉంచనున్నారు.
-సూర్యాపేట, జూలై 4 (నమస్తే తెలంగాణ)
ఆ బాధ వర్ణణాతీతం
నా భర్త శ్రీమన్నారాయణ ఆకస్మిక మృతితో మా కుటుంబం పడిన బాధ అంతులేనిది. డెడ్‌బాడీని ఎక్కడ పెట్టాలో తెలియక చాలా క్షోభ అనుభవించినం. అంత్యక్రియల నుంచి దశదిన కార్యక్రమాల వరకు ఇబ్బందులు పడ్డాం. చివరి మూడు రోజులు ఓ లాడ్జిలో ఉండాల్సి వచ్చింది. మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శించేందుకు వచ్చిన సమయంలో విషయం తెలుసుకొని చాలా బాధపడ్డారు.
అద్దె ఇంట్లో ఉంటూ ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబాలు ఇబ్బంది పడకుండా మహా ప్రస్థానంలో మంత్రి ప్రత్యేక భవనం
నిర్మిస్తుండడం గొప్ప విషయం.
సూర్యాపేట, జూలై 4 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతో పాటు సీఎం కేసీఆర్‌ను ఒప్పించి వందల కోట్లు తెచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేటకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొస్తున్నారు. ప్రభుత్వం మినీ ట్యాంక్‌బండ్‌లను నిర్మిస్తుండగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సూర్యాపేటకు మాత్రమే మంత్రి చొరవతో రెండు మినీ ట్యాంక్బండ్లు మంజూరు కాగా సద్దులు చెరువు పూర్తయింది. పుల్లారెడ్డి చెరువు వద్ద పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఎక్కడ ఎవరికీ ఏది కావాలో తెలుసుకొని మరీ చేయిస్తున్నారు. అందులో భాగంగా సూర్యాపేటలో అత్యాధునిక వసతులతో మహాప్రస్థానం నిర్మించగా తాజాగా అదే ప్రాంగణంలో ప్రత్యేక భవనం నిర్మిస్తున్నారు. బతికున్నంత కాలం పేద, మధ్య తరగతితో పాటు పేదలు ఇలా ఎవరైనా ఇతరులతో పోలిక పెట్టుకోకుండా ఉన్నంతలో కాలం సంతోషంగా జీవిస్తారు.
సొంత ఇల్లు లేని వారు వారి స్థోమతను బట్టి అద్దె ఇండ్లల్లో ఉంటున్నారు. దురదృష్టవశాత్తు అలాంటి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతం. చాలా చోట్ల అద్దె ఇంట్లోకి మృతదేహాన్ని తీసుకురానివ్వని సంఘటనలు ఉన్నాయి. ఆ కుటుంబంలో ఒకరు చనిపోయారనే బాధ కంటే మృతదేహాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక బాధిత కుటుంబాలు పడే క్షోభ చెప్ప లేనిది. ఇలాంటి సంఘటనలు తన దృష్టికి తీసుకెళ్లడంతో అలాంటి కుటుంబాల్లో ఇబ్బందులు తొలిగించాల్సి ఉందని ప్రముఖ న్యాయవాది శ్రీమన్నారాయణ ఆకస్మిక మృతి అనంతరం ఆ కుటుంబ బాధలు, క్షోభ ఎంతో బాధించడంతో మంత్రి జగదీశ్‌రెడ్డి చలించి మహాప్రస్థానంలో ప్రత్యేక భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అది కార్యరూపం దాల్చింది. రూ.86 లక్షలతో మహాప్రస్థానం వద్ద సకల సౌకర్యాలతో నిర్మించనున్న భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
20మంది ఉండేలా ..
మహాప్రస్థానం ఆవరణలో రూ.86 లక్షలతో బాధిత కుటుంబాలు ఉండేందుకు రెండంతస్తుల్లో ప్రత్యేక భవనం నిర్మిస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించే వరకు ఉంచేందుకు గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద హాల్ నిర్మిస్తారు. అంత్యక్రియల అనంతరం పది రోజుల పాటు కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి బాధిత కుటుంబంతో పాటు బంధువులు, ఆప్తులు మొదటి అంతస్తులో 20 మందికి పైనే ఉండేలా మూడు పోర్షన్లు అలాగే కిచెన్ నిర్మించనున్నారు. అంతే కాకుండా వంట సామగ్రిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
అంతా ఉచితమే..
మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో మహాప్రస్థానం వద్ద రూ.86 లక్షలతో నిర్మిస్తున్న ప్రత్యేక భవనం మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేయిస్తాం. ఇప్పటికే టెండర్ ప్రకియ పూర్తయి పనులు ప్రారంభమయ్యాయి. ఈ భవనం అందుబాటులోకి వచ్చిన తరువాత బాధిత కుటుంబాలు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతా ఉచితమే.
– రామానుజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్