నీలగిరి, జూన్ 03 : పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ చందనాదీప్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఫలితాలు వెలువడిన తరువాత జిల్లా పరిధిలో ఏ చిన్నపాటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా దాదాపు 630 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నలుగురు కంటే ఎకువగా గుంపులుగా తిరగడం చేయకూడదని సూచించారు.
ఎన్నికల నియమావళి ప్రకారం అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. అభ్యర్థులు, ఏజెంట్లు, లెకింపునకు హాజరయ్యే అధికారులు సెల్ఫోన్లు, నిషేధిత వస్తువుల అయిన అగ్గిపెట్టె, లైటర్, ఇంక్ బాటిల్, లిక్విడ్, వాటర్ బాటిల్, పేలుడు వస్తువులను లెకింపు కేంద్రాల్లోకి తీసుకు రాకూడదని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద విధులకు హాజరయ్యే ప్రధాన ఏజెంట్లు, కౌంటింగ్ ఏజంట్లు, మీడియా ప్రతినిధులు ఎన్నికల అధికారి జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు తప్పక వెంట ఉంచుకొని తనిఖీలు చేసే పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. వాహనాలను పారింగ్ స్థలంలోనే పార్ చేయాలని, ప్రతిఒకరూ ఎన్నికల బంధనలు పాటించాలని సూచించారు.