తుంగతుర్తి, మే 25 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల (రివ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కిం) ప్రీ.పెయిడ్ మీటర్ల విధానంతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల తర్వాత రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తుందని మోటార్లకు మీటర్లు పెడతారని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పుడే చెప్పారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందు చూపులేని నిర్ణయాలతో రైతులు ఆర్థికంగా నష్టపోతారని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమును అమలు చేయాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
ఈ విధానం వల్ల లక్షలాది మంది రైతాంగానికి విద్యుత్ అనేది గుదిబండగా మారనుందని, వ్యవసాయానికి విద్యుత్ మోటార్ కనెక్షన్ కోసం ఇప్పుడొస్తున్న ప్రభుత్వ సబ్సిడీ పూర్తిగా ఎత్తివేసి మొత్తం అయ్యే ఖర్చు రైతు నెత్తిన మోపబడుతుందన్నారు. ఉచిత విద్యుత్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే రద్దు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు గాజుల యాదగిరి , గోపగాని రమేష్ పాల్గొన్నారు.