చౌటుప్పల్, జనవరి 23 : రోగులకు వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరు అవడంపై యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు సీరియస్ అయ్యారు. చౌటుప్పల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టిక, ఓపీ రిజిస్టర్, ల్యాబ్, మందుల స్టాక్, డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించారు. సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైన జనరల్ సర్జన్ వివేక్, నాచురోపతి వైద్యురాలు గీత, కాంపౌండర్లు అశ్విని, మెర్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. దవాఖానలో ఓపీ, డెలివరీల సంఖ్య చాలా తక్కువగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను టెస్టుల కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు పంపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వంద పడకల దవాఖానను పరిశీలించి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తాసీల్దార్ హరికృష్ణ, ఆర్ఐ సుధాకర్ రావు, వైద్యురాలు అలివేలు, ఇతర వైద్యసిబ్బందిపాల్గొన్నారు.