మానసిక ఉల్లాసానికి తోడ్పడే క్రీడలంటే అందరికీ ఇష్టమే. కొంతమంది ఉత్సాహం కోసం ఆడితే.. మరికొంతమంది అందులో కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. కఠోర సాధనతో వాటిని సాధిస్తారు. ఈ ఇద్దరు మహిళలు ఈ కోవకే చెందుతారు. కండక్టర్లుగా రైట్‌రైట్ అంటూ ఉద్యోగాలు చేస్తూనే.. తమకు ఇష్టమైన ఆటల్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారు. సాధించాలనే తపన ఉంటే వయసు, పరిస్థితులు అడ్డంకి కావని నిరూపిస్తున్న లేడీ కండక్టర్లు తలారి మంజుల, భైరి స్వరాజ్యలక్ష్మి గెలుపు కథలు ఇవి..
రంగారెడ్డి జిల్లాకు చెందిన మంజులకు పాఠశాల స్థాయినుంచే క్రీడలంటే ఎంతో ఇష్టం. తను నవోదయ విద్యాలయంలో చదువుకుంది. పాఠశాలలో ఎప్పుడు క్రీడాపోటీలు నిర్వహించినా ఉత్సాహంగా పాల్గొనేది. గెలిచి తీరేది. మంజుల ఆటతీరును గమనించిన వ్యాయామ ఉపాధ్యాయులు ఆమెను మరింతగా ప్రోత్సహించడం మొదలు పెట్టారు. అలా స్కూల్లో ఉన్నప్పుడే వివిధ క్రీడల్లో ఏడుసార్లు జాతీయస్థాయి ఈవెంట్లలో పాల్గొని మెడల్స్ గెలుచుకున్నది. డిగ్రీలో ఎన్సీసీ కూడా పూర్తి చేసిన మంజుల పోలీస్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని కష్టపడింది. కానీ, శారీరక దృఢ పరీక్షల్లో రెండు కిలోలు బరువు తక్కువ ఉండటంతో ఎంపిక కాలేకపోయింది. పోలీస్ నౌకరిపై ఆశలు వదులుకొని 2003లో పెండ్లి చేసుకొని తనకు ఇష్టమైన క్రీడలకు స్వస్తి పలికి గృహిణిగా స్థిరపడింది. తాను చదివిన చదువుకు తగిన ఉద్యోగం చేయాలనే ఆలోచనతో మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2010లో ఆర్టీసీ నోటిఫికేషన్ చూసి భార్యభర్తలిద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షరాసి ఆర్టీసీ కొలువు సాధించారు. దంపతులు ఇద్దరూ కూకట్పల్లి డిపోలోనే కండక్టర్లుగా చేరడం విశేషం. ఆర్టీసీలో చేరిన మంజులకు తిరిగి ఆటల్లో రాణించాలనే ఆలోచనను తన భర్తకు చెప్పింది. భార్య ఇష్టాన్ని గౌరవించి ఓకే చెప్పాడు ఆయన. భర్త ప్రోత్సాహం ఆమెకు కొండంత బలాన్నిచ్చింది.
2013లో అనంత మెమోరియల్ నిర్వహించిన క్రీడాపోటీల్లో అనంతపురానికి వెళ్లి మరీ పాల్గొని జావెలిన్ త్రో, లాంగ్ జంప్, పరుగు పందెంలో గోల్డ్, సిల్వర్ పతకాలు సాధించింది మంజుల. అలా తిరిగి తన క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె ఇప్పటివరకు తొమ్మిదిసార్లు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది. 2022లో మలేషియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో హై జంప్‌లో ద్వితీయ, షార్ట్పుట్లో మొదటి బహుమతి సాధించింది. అలా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటూ ఇప్పటివరకు 23 బంగారు, 24 రజిత పతకాలను కైవసం చేసుకుంది. ప్రస్తుతం మంజుల వంద మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్ క్రీడల్లో అండర్ 45 విభాగంలో రాణిస్తున్నది 42 ఏండ్ల మంజుల.
ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు నిద్ర లేచి, వంట చేసుకొని తెల్లవారుజామున 5 గంటలకల్లా డిపోకు బయలుదేరుతుంది మంజుల. జగద్గిరిగుట్ట నుంచి బచ్చన్నపేట వరకు వెళ్లే స్పెషల్ బస్సుకు ఈమెనే కండక్టర్. ఉదయం బయలుదేరి తిరిగి డిపోకు వచ్చేసరికి రాత్రి 7 అవుతుంది. తాను చేసే కండక్టర్ ఉద్యోగం డే బై డే ఉండటం వల్ల ఖాళీ సమయాల్లోనే సాధన కొనసాగిస్తున్నది. ఉద్యోగం చేసి అలసిపోయినా తెల్లవారగానే షూస్ వేసుకొని గ్రౌండ్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లే మంజులను చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఈ ఆటలు ఆడటం ఏమిటి? వీటి వల్ల ఏం ఒరుగుతుంది? ఏం సాధించావు’ అని అడిగేవాళ్లకు తన నిండైన ఆరోగ్యాన్నే సమాధానంగా చెబుతున్నది మంజుల. తాను సాధించిన పతకాలను బీట్ చేసేందుకు తమ పిల్లలు, ఆమె మరిది పిల్లలు కలిసి మెడల్స్ కోసం పోటీ పడుతున్నారంటూ గర్వంగా చెప్పుకొచ్చింది ఈ కండక్టరమ్మ. క్రీడలతో పతకాలే కాదు.. ఆరోగ్యాన్ని కూడా సాధించొచ్చని నిరూపిస్తున్నది.
వరంగల్ జిల్లాకు చెందిన స్వరాజ్యలక్ష్మికి ఇద్దరు చెల్లెళ్లు. తన తండ్రి రైల్వే ఉద్యోగి అయినా కూడా ముగ్గురి చదువులు సాగకపోవడంతో తాను ఐటీఐ చేసి ఈసీఐఎల్‌లో అప్రెంటీస్ చేసింది. ఆ సమయంలోనే ఆర్టీసీలో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడటంతో కుటుంబం కోసం వెంటనే ఆ కొలువుకు దరఖాస్తు చేసుకొని పరీక్ష పాసై కంటోన్మెంట్ డిపోలో కండక్టర్ కొలువెక్కింది. తాను ఉద్యోగం చేస్తూ చెల్లెళ్లను బీటెక్ చేయించి, వారికి ఉద్యోగాలు వచ్చిన తరువాత 2005లో పెళ్లి చేసుకున్నది. పాఠశాలలో ఉన్నప్పుడు పరుగు పందెంలో ముందుండే స్వరాజ్యలక్ష్మిని కుటుంబ పరిస్థితులు వెనక్కు నెట్టాయి. పోలీస్ కావాలనుకున్న ఆమె పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆర్టీసీ కండక్టరైంది. అయినాసరే చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కునే ఆమె 2017లో క్రీడా పోటీల్లో పాల్గొన్నది. అలా 2018లో ఇండోనేషియాలో నిర్వహించిన ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 800 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలు సాధించింది. 300 మీటర్లలో కాంస్య పతకం కైవసం చేసుకున్నది. ఆ తరువాత 2022లో మలేషియాలో నిర్వహించిన అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 800, 400 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించింది. ఇప్పటివరకు తొమ్మిదిసార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో మెడల్స్ కొల్లగొట్టింది 49 ఏండ్ల స్వరాజ్యలక్ష్మి.
ఒకవైపు క్రీడల్లో పాల్గొంటూనే మరోవైపు ఆర్టీసీ కండక్టర్‌గా తన విధులను క్రమశిక్షణతో నిర్వర్తిస్తున్నది స్వరాజ్యలక్ష్మి. ప్రతిరోజూ ఉదయం 3:30గంటలకు లేచి వంటచేసుకొని 4:30 వరకు డిపోకు చేరుకుంటుంది. మధ్యాహ్నం వరకు కండక్టర్ డ్యూటీ ముగించుకొని ఇంటికొస్తుంది. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు గ్రౌండ్‌లోనే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. తన పరుగును చూసి అక్కడికి వచ్చేవారంతా ఆశ్చర్యపోతుంటారట. ప్రైవేట్ ఉద్యోగం చేసే తన భర్త తన ఇష్టాలను గౌవరించడం వల్లే ఇది సాధ్యమవుతుందని ఆమె చెప్పుకొచ్చింది.
‘పంజాబ్, కేరళ రాష్ర్టాలకు చెందిన అథ్లెట్స్ చాలా వేగంగా పరిగెత్తుతుంటారు. వారిని అధిగమించేందుకు సాధన చేస్తున్నాను’ అంటుంది స్వరాజ్యలక్ష్మి. గతంలో 17 సెకండ్లలో 100 మీటర్ల దూరాన్ని చేరే ఈ పరుగుల రాణి ప్రస్తుతం ఆ దూరాన్ని 15 సెకండ్లలో చేరేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం అండర్ 50 విభాగంలో 100, 400, 800 మీటర్ల పరుగులో పోటీ పడుతున్న ఈ క్రీడాకారిణి పీటీ ఉషను స్ఫూర్తిగా తీసుకుంది. ఒలింపిక్స్ లక్ష్యంగా కష్టపడుతున్నది. ‘ఎంత బిజీగా ఉన్నా మన ఆరోగ్యం కోసం రోజూ కనీసం అరగంటైనా నడవండి’ అంటూ తోటి ఉద్యోగులకు సలహా ఇస్తున్నది స్వరాజ్యలక్ష్మి. క్రీడలకు వయసుతో పనేంటని చాటిచెబుతున్న ఈ కండక్టరమ్మ నిజంగా ఎంతో గ్రేట్!
– రాజు పిల్లనగోయిన