ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తున్నది. సర్కారు నుంచి పలు రకాల మందుల సరఫరా కొద్దిరోజులుగా నిలిచిపోయింది. ముఖ్యంగా బీపీ, షుగర్, గ్యాస్, జలుబు, దగ్గు గోలీలు దొరుకడం లేదు. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేది లేక ప్రైవేట్‌లో కొనుగోలు చేస్తున్నారు.
జిల్లా కేంద్ర దవాఖానతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఉప కేంద్రాలు, బస్తీ, పల్లె దవాఖానలు జిల్లాలో నడుస్తున్నాయి. వివిధ రకాల వ్యాధుల చికిత్స కోసం నిత్యం వేలాది మంది రోగులు వస్తుంటారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీల సంఖ్య కూడా పెరిగింది. వీరందరికీ ఉచితం వైద్యం చేయడంతోపాటు, మందులు అందించడం ప్రభుత్వ బాధ్యత. కానీ రోగులకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలన్నరగా సరిపడా మందులను అందుబాటులో ఉంచడం లేదు.
పలు రకాల మందులు ప్రభుత్వం నుంచి సరఫరా కావడం లేదు. ముఖ్యంగా బీపీ, షుగర్, గ్యాస్ సమస్యలకు సంబంధించిన మందు బిల్లలతో పాటు సీజనల్ వ్యాధులకు ఇచ్చే పలు మందులు దొరుకడంలేదని రోగులు చెబుతున్నారు. కొన్ని రకాల మందుల కోసం నేషనల్ హెల్త్ స్కీమ్ నుంచి నిధులు సమకూరుతాయి. ఇవి నేరుగా ఆయా పీహెచ్‌సీలకు జమ చేయగా.. అక్కడున్న అవసరాలకు అనుగుణంగా మందులను కొనుగోలు చేస్తారు. ఇది ప్రక్రియ సరిగ్గానే జరుగుతున్నట్లు తెలుస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే మందులు మాత్రం రావడంలేదు. ఉమ్మడి జిల్లాలోని మూడు జిల్లాలకు నల్లగొండ నుంచి సరఫరా అవుతాయి. ఇక్కడే సమస్య ఎదురవుతున్నది.
ప్రభుత్వం సకాలంలో మెడిసిన్ సరఫరా చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ పేషెంట్లు నిత్యం ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే శరీరం నియంత్రణ తప్పుతుంది. షుగర్ పెరుగడం, బీపీ పెరుగడం, తగ్గడం లాంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఆస్పత్రిల్లో ఈ మందులు లేకపోవడంతో కొందరు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. దాంతో రోగుల జేబులు గుల్ల అవుతున్నాయి. ఇంకొందరు కొనలేక ఉత్తగానే ఉండిపోతున్న పరిస్థితి నెలకొంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ సీఎం కేసీఆర్ జనం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దగ్గరుడిని స్పెషల్ ఫోకస్ పెట్టేవారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రోజురోజుకూ పరిస్థితి మారుతూ వస్తున్నది. ఇందుకు మందు గోలీల కొరతే తార్కాణం. సర్కారు దృష్టి పెట్టి.. సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
వర్షాకాలం కావడంతో సాధారణంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. ముఖ్యంగా డెంగీ, మలేరియా, టైపాయిడ్, చికున్‌గున్యా, పైలేరియా వంటి వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రస్తుతం వర్షాలు భారీగా లేనప్పటికీ విష జ్వరాలు పెరుగుతున్నట్లు తెలుస్తున్నది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించి అన్ని రకాల కిట్లు, పరీక్షలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
నా భర్తకు నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో వారం రోజుల కితం ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత బయటకు తీసుకొచ్చి వార్డులో చేర్చారు. డాక్టర్లు వచ్చి చూసి మందులు రాస్తున్నారు. కానీ మందులు ఇవ్వడం లేదు. వార్డులో నర్సులను అడిగితే మా దగ్గర లేవు, ఫార్మసీకి వెళ్లి అడుగాలని చెబుతున్నరు. రోజూ ఫార్మసీకి వచ్చి అడుతున్నా ఇవి లేవని అంటున్నరు. ఎట్లా సారు అంటే రేపు మాపు వస్తాయని చెబుతున్నరు. ఆపరేషన్ అయిన మనిషికి ఎట్లా ఉంటదో ఏమో అని భయపడి వారం రోజుల నుంచి బయటనే మందులు తెచ్చుకుంటున్నాం. ఇప్పటికే మూడు వేల రూపాయలకు పైనే మందులు కొన్నా.
– దుర్గమ్మ, రోగి బంధువు, నల్లగొండ ప్రభుత్వ దవాఖాన
వారం రోజుల నుంచి కాళ్లనొప్పులు, ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరసం వస్తుందని గవర్నమెంట్ దవాఖానకు వచ్చిన. డాక్టర్‌కు చూపించుకున్నంక మందులు రాసిండు. నొప్పుల గోలీలు, జ్వరం గోలీలు మాత్రమే ఇచ్చిండ్రు. కానీ బోదకాలు గోలీలు ఇయ్యట్లేరు. నాకు బోదకాలు గోలీలు వేసుకోకపోతే జ్వరం, నొప్పులు ఎక్కువ అయితయి. ఇప్పుడు ఈ గోలీలు వేసుకున్నా నొప్పులు తగ్గవు. బోదకాలు గోలీలు అడిగితే అయిపోయినయి అని చెపుండ్రు. దావఖానకు రెండు, మూడు మార్లు రావాలంటే చార్జీలు ఎక్కువ అయితున్నయ్. ఒక్కసారి గోలీలు ఇస్తే మళ్ల 15 రోజుల దాకా రాను. గోలీలు వచ్చేవారమన్న ఇస్తరో ఇయ్యరో మరి.
– జటంగి కొండమ్మ, నోముల, నకిరేకల్ మండలం
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృభిస్తుండడంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి జనాలు క్యూ కడుతున్నారు. ప్రతిరోజూ వెయ్యికి పైగానే రోగులు వస్తున్నారు. ఈ నెల 8నుంచి 13 వరకు ఆరు రోజుల్లో 7,483 మంది వివిధ రకాల వ్యాధులకు ఓపీ రోగులు వచ్చారు. వీరిలో 1,129 మందికి మాత్రమే మందులు ఇచ్చారు. అవి కూడా అరకొరే. మిగిలిన వారందరికీ మందులు లేవని చెప్పడంతో వారు ప్రైవేట్‌కు వెళళ్లి తీసుకొస్తున్నారు. ఆపరేషన్ చేసిన మనుషులకు సైతం మందులు ఇవ్వడం లేదంటే ఆస్పత్రిలొ మందుల కొరత ఎలా ఉందో అర్థమవుతున్నది. డెంగ్యూ, చికెన్గున్యావంటి వ్యాధులు వచ్చిన వారికి టెస్టులకు కిట్లు సరిపడా లేకపోవడంతో డాక్టర్లు మందులు రాసి ఇస్తున్నారు. కానీ ఆ మందులు కూడా అక్కడ ఉండడం లేదు. కలెక్టర్ నారాయణరెడ్డి ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి పెట్టినా మందుల కొరత మాత్రం అలాగే ఉన్నది.
వర్షాకాలం కావడంతో మా గ్రామంలో సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. చూపించుకునేందుకు మండలంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్తే అక్కడ సరైన మందులు లేవు. ఉన్న మందులను ఇచ్చినా జ్వరాలు తగ్గడం లేదు. రోగులు చేసేదేమీ లేక మిర్యాలగూడ, నల్లగొండ పట్టణాలకు వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించుకోవాల్సి వస్తున్నది. వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. పేదోళ్లమైన మా దగ్గర డబ్బులు లేక ప్రభుత్వాస్పత్రికి వెళ్తే అక్కడ సరిగా చూస్తలేరు.
– కుర్ర సంతు, అడవిదేవులపల్లి
నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు సరపడా మందులు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సమస్య లేదు. ఎప్పటికప్పుడు కలెక్టర్ పర్యవేక్షణ చేస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే అయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నాం. మందులు అవసరమైతే ఇండెంట్ పెట్టి బయట నుంచి కొనుగోలు చేస్తున్నాం. సీజనల్ వ్యాధులు కావడంతో రోజూ రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. రక్త, మూత్ర, ఇతర అన్ని రకాల పరక్షలు చేస్తున్నాం.
-నిత్యానందం, నల్లగొండ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్