సూర్యాపేట టౌన్, జనవరి 06 : సంక్రాంతి పండుగ సందర్భంగా నిషేధిత చైనా మంజా విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల భద్రత, ఇతర ప్రాణుల రక్షణ దృష్ట్యా చైనా మాంజాపై నిషేదం ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చైనా మంజా కొనిపించవద్దన్నారు. సంక్రాంతి పండుగ వేళ సూర్యాపేట జిల్లాలో చైనా మాంజాపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
చైనా మాంజా వల్ల పక్షులు, వాహనదారులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనల ఉన్నాయన్నారు. చైనా మాంజా విక్రయం, వినియోగంపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు, టాస్క్ఫోర్స్ బృందాలు ప్రత్యేక నిఘా ఉంచి రౌండ్స్ నిర్వహిస్తాయని స్పష్టం చేశారు. కావునా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సవం విషాదం కాకుండా చూసుకోవాలన్నారు. ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్లు తెలిసినా వెంటనే డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712686057, 8712686026 నంబర్లకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.