నీలగిరి, జూలై 27 : వర్షాలు ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు జిల్లా ప్రజలను వణికిస్తున్నాయి. పల్లెలు, పట్టణం అనే తేడా లేకుండా అంతటా డెంగీ, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. నల్లగొండ జిల్లా జనరల్ ఆసుపత్రికి రోజూ ఐదు వందల మంది వరకు జ్వర బాధితులు వస్తున్నట్లు దవాఖాన అధికారులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం ఇప్పటి వరకు 9,574 మంది జ్వరాల బారిన పడ్డారని, అందులో ఒక మలేరియా, నాలుగు చికున్ గున్యా, 54 డెంగీ కేసులు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ.. వాస్తవికంగా సుమారు 58,236 మంది జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. నాగార్జునసాగర్ ఆయకట్టుతోపాటు అన్ని మున్సిపాలిటీలు, మరికొన్ని మండలాల్లో విషజ్వరాలు అధికంగా ఉన్నట్లు తెలిసింది.
గ్రామ పంచాయతీ పాలకవర్గాలు లేకపోవడంతో పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. దాంతో ఇటీవల కురిసిన వర్షాలకు సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీల్లోని స్లమ్ ఏరియాల్లో, నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో ప్రజలు జ్వరాల బారిన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. జ్వరం బారిన పడి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్తే మందు బిల్లలతోనే సరిపెడుతున్నారు.
గ్యాస్, కడుపు నొప్పి, ఇతర మందులతోపాటు స్లైన్ బాటిల్స్ లేకపోవడంతో బయటికే రాస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో లేకపోవడంతో పేదలు సైతం ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించాల్సి వస్తుంది.
మరికొందరు స్థానికంగా ఉండే ఆర్ఎంపీలు ఇచ్చిన మందులను వాడుతూ సరిపెట్టుకుంటున్నారు. గతంలో మలేరియా, టైఫాయిడ్, చికున్ గున్యా, బోధకాలు తదితర వ్యాధుల బారిన పడి పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు సీజన్ వ్యాధులతో ఇబ్బందులకు గురవుతుంటే.. ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రోగులతో నిండిన జిల్లా ఆసుపత్రి
నల్లగొండ జిల్లా జనరల్ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతున్నది. సీజనల్ వ్యాధులతోపాటు పలు రోగాలకు సంబంధించి పేషెంట్లు చికిత్స కోసం పెద్ద ఎత్తున ఆసుపత్రికి వస్తున్నారు. అయితే.. పేరుకే పెద్దాసుపత్రి అయినా రోగులకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఉండటం లేదు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరిపడా మంచాలు లేకపోవడంతో వార్డుల్లో, బాల్కనీల్లో నేలపైనే చికిత్స పొందుతున్నారు. రోజూ వందల సంఖ్యలో రోగులు వస్తుండడంతో వైద్య సిబ్బంది ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు.
ప్రమాదకర పరిస్థితి ఉన్న మండలాల గుర్తింపు
జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదకర మండలాలను జిల్లా వైద్యారోగ్య శాఖ గుర్తించింది. మలేరియా, డెంగీతోపాటు విషజర్వాలు ప్రబలే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించిన అధికారులు.. అక్కడ ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రజలను చైతన్యం చేస్తున్నారు. పెద్దవూర, డిండి, దామరచర్ల, హాలియా, త్రిపురారం, అడవి దేవులపల్లి, నల్లగొండ, నాగార్జునసాగర్తోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు నిడమనూరు, తిరుమలగిరి, అడవిదేవులపల్లి, మర్రిగూడ, నకిరేకల్, కట్టంగూర్ను ప్రమాదకర మండలాలుగా గుర్తించారు.
విజృంభిస్తున్న డెంగీ, మలేరియా
జిల్లాలో మలేరియా జ్వరాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. నాలుగేండ్లుగా నమోదు కాని మలేరియా పాజిటివ్ కేసులు ఈ సంవత్సరం నమోదవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు రికార్డుల్లో ఉన్నా.. అనధికారంగా సుమారు 250 కేసులు వచ్చినట్లు తెలిసింది. అది కూడా నల్లగొండ జిల్లా కేంద్రంలోనే ఎక్కువ మొత్తంలో ప్రబలినట్లు సమాచారం. దీనికితోడు డెంగీ కూడా విజృంభిస్తుంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో 90,091 మంది నుంచి రక్త నమునాలు సేకరించగా.. అందులో 54 డెంగీ, 4చికున్ గున్యా కేసులు నమోదయ్యాయి.
9,574 సాధారణ జ్వరాలు వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో విషజ్వరాలు ప్రబలడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు ఆ గ్రామంలో చాలా రోజులు క్యాంపులు పెట్టి సాధారణ స్థితికి తెచ్చారు. అదేవిధంగా యాదాద్రి థర్మల్ ప్లాంటులో కూడా విషజ్వరాలు ప్రబలాయి. సాగర్ ఆయకట్టు ప్రాంతంలోని చాలా గిరిజన తండాల్లో విషజ్వరాలు విజృంభించాయి. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మున్పిపాలిటీల్లో విషజ్వరాలు ప్రబలుతుండడంతో కలెక్టర్ ఇంటింటి సర్వేకు ఆదేశాలు ఇచ్చారు.
డెంగీతో హోంగార్డు మృతి
మఠంపల్లి, జూలై 27 : మఠంపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు జానీ డెంగీతో శనివారం మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హోంగార్డు జానీ ఆరు నెలల క్రితం చిలుకూరు పోలీస్ స్టేషన్ నుంచి మఠంపల్లి పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. ఆయనకు 10రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో అస్వస్థతకు గురయ్యాడు.
దాంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించి శనివారం మృతి చెందాడు. జానీ మృతికి హుజూర్నగర్ సీఐ చరమందరాజు, మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జానీ స్వస్థలం హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పీహెచ్సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం
సీజనల్ వ్యాధులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులను అందుబాటులో ఉంచాం. ఇప్పటి వరకు జిల్లాలో ఒక మలేరియా కేసు మాత్రమే నమోదైంది. నాగార్జున సాగర్లోని ఆయకట్టు, నకరేకల్తోపాటు మరికొన్ని మండలాల్లో సాధారణ జ్వరాలు వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. దీనిపై వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నాం. జిల్లా అంతటా ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తున్నాం.
కలెక్టర్ ఆదేశాలతో మున్సిపాలిటీల్లో రెండోసారి జ్వర సర్వే నిర్వహిస్తూ జ్వర బాధితులను గుర్తించి మందులు అందిస్తున్నాం. మూడు రోజులు పర్యవేక్షణలో ఉంచి తగ్గకపోతే సమీపంలోని పీహెచ్సీ, యూహెచ్సీలకు పంపి వైద్యం అందిస్తున్నాం. జిల్లాలో ఎలాంటి సమస్యలూ లేవు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సీజనల్ వ్యాధులను అరికడుతున్నాం.
– డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి