రామగిరి, డిసెంబర్ 7 : విద్యకు పెద్ద పీట వేస్తామంటూ ఊదరగొట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చదువులను సైతం నీరుగారుస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి సభ నేపథ్యంలో జన సమీకరణ రవాణా కోసం అధికారులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై ప్రతాపం చూపారు. అన్ని స్కూళ్లూ బస్సులు పంపాలని హుకూం జారీ చేయడంతో శనివారం నల్లగొండ జిల్లావ్యాప్తంగా పాఠశాలలు అన్నింటికీ సెలవు ప్రకటించారు. మొదట డీజిల్, డ్రైవర్‌కు బత్తా ఇస్తామని చెప్పినా. ఆఖరికి అవి కూడా ఇవ్వలేదని ఓ స్కూల్ యజమాని వాపోయారు.
సీఎం సభకు ప్రైవేట్ పాఠశాలల బస్సులను పంపించాలని జిల్లా అధికారులు, ఆర్టీఏ అధికారులు ఒక్క రోజు ముందే ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఉదయమే బస్సులను అధికారులు సూచించిన ప్రాంతాలకు పంపించారు. మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు అక్కడ బస్సులను ఉంచుకుని సరిపడా జనం లేకపోవడంతో కొన్నింటిని వెనక్కి పంపించారు. కాగా, సీఎం సభ కోసమని పాఠశాలలకు సెలవు ఇచ్చి బస్సులను వాడుకోవడమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.