కోదాడ, జనవరి 03 : సామాజిక రుగ్మతలపై సమరభేరి మోగించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయీమ్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని శనివారం కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో అవమానాలు, అవహేళనలను అధిగమించి మహిళలకు చదువు, సంస్కారం నేర్పిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. సమాజంలో మహిళా సాధికారతకు కృషి చేసిన మహనీయులు అన్నారు.
ఆమె ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్ల సుందర్ బాబు, పిట్టల భాగ్యమ్మ, కాసాని మల్లయ్య గౌడ్, ఉపేందర్ గౌడ్, చలిగంటి వెంకట్, దొంగరి శ్రీనివాస్, రాంబాబు, శ్రీకాంత్, వెంకట్రావు, షేక్ మౌలానా, సంగిశెట్టి గోపాల్, గంధ శ్రీనివాస్, ఉపేందర్, మౌలా శాంతా, భూక్య సైదా పాల్గొన్నారు.